
హోటల్‌లో భారీ చోరీ
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్‌రోడ్డులో గల వైష్టవీ గ్రాండ్ హోటల్‌లో భారీ చోరీ జరిగింది. వన్‌టౌన్ సీఐ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ నిర్వాహకుడు రావిరాల రవికుమార్ రోజుమాదిరిగా శుక్రవారం రాత్రి తన చాంబర్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చాంబర్ తలుపునకు ఉన్న తాళం పగులకొట్టాడు. గదిలోని కౌంటర్‌ను బద్దలుకొట్టి అందులో దాచిన రూ.80లక్షలను అపహరించాడు. మరుసటి రోజు ఉదయం చాంబర్ తలుపు తాళం పగులకొట్టి ఉండటాన్ని గమనించిన సిబ్బంది నిర్వాహకులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐలు నాగభూషణం, పీఎన్‌డీ ప్రసాద్ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. డీఎస్పీ రాజశేఖరరాజు హోటల్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీని పరిశీలిస్తున్నామని అందులో ఒక వ్యక్తి వచ్చి బ్యాగ్‌తో వెళ్లిన దృశ్యాలు కనిపించాయని డీఎస్పీ తెలిపారు. క్లూస్ టీం ఆధారాలు, సీసీ పుటేజీ, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. హోటల్ నిర్వాహకుడు రావిరాల రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగభూషణం తెలిపారు.
● రూ.80 లక్షలు దోచుకెళ్లిన దుండగులు