
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య
85 శాతం విగ్రహాలు నిమజ్జనం
ఘనంగా గణనాథుల నిమజ్జనం
ఫ శోభాయమానంగా సాగిన ఊరేగింపు
ఫ యువత నృత్యాలు, డీజేలతో కోలాహలం
భువనగిరి: తోమ్మిది రోజుల పాటు భక్తులచే విశేష పూజలందుకున్న గణనాథులు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై వినాయకులను ఉంచి యువత నృత్యాలను చేస్తూ కోలాటాలు వేస్తూ జై గణేశా..బైబై గణేశా అంటూ నినాదాలు చేస్తూ మేళతాళాల మధ్య బాణా సంచాలు కాల్చూతూ నిమజ్జానికి తరలించారు. పోయిరా గణపయ్య అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. మహారాష్ట్ర, కేరళ, కళాబృందాలు, నృత్యాలు, ఆగోరా వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భువనగిరిలో శోభాయాత్ర సాగిందిలా..
జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్ర ఐదు రూట్‌లలో కొనసాగింది. పాత బస్టాండ్, కిసాన్‌నగర్, రాంనగర్, తాతానగర్, హోసింగ్‌బోర్డు కాలనీల నుంచి బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా వరకు వచ్చిన విగ్రహాలు.. అక్కడి నుంచి శోభాయాత్రగా పెద్ద చెరువుకు చేరాయి. భువనగిరి పెద్ద చెరువు వద్ద మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనాన్ని ప్రారంభించారు. బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా వద్ద భువనగిరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధాన రహదారి వెంట భక్తులకు ఆర్ట్‌ఆఫ్‌లివింగ్, ఇన్నర్‌వీల్ క్లబ్, టీఆర్‌కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల నుంచి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భువనగిరిలో రాత్రి 9 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. శ్రీరామ భక్త భజనమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలంలో శ్రీ పోల్కం రాములు రూ.1,12,100కు దక్కించుకున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
గణేష్ నిమజ్జనం సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణంలో డీసీపీ అక్షాంశ్‌యాదవ్ పర్యవేక్షణలో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు నిమజ్జనంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రధాన కూడళ్లల్లో పోలీసులు భారీగా మొహరించారు. తాతానగర్‌లో డీజేకి అనుమతి లేదని పోలీసులు సూచించడంతో ఉత్సవ సభ్యులు ధర్నాకు దిగారు.
భువనగిరి పట్టణంతో పాటు చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, బీబీనగర్ మండల కేంద్రాలు, పాటు ఇతర మండలాల పరిధిలోని గ్రామాల్లో గణేష్ నిమజ్జనం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయగా, అందులో 85 శాతం వరకు నిమజ్జానికి తరలించారు.

వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య