
నేడు గణేష్ నిమజ్జనం
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ తదితర పట్టణాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువుల వద్ద లైట్లు, బారికేడ్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులు స్వాగతం పలికేందుకు వేదికలు ఏర్పాట్లు చేసుకున్నారు.
153 మంది జీపీఓలు
మోత్కూరు: జిల్లాకు 153 మంది గ్రామ పాలనాధికారులు (జీపీఓ) రానున్నారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. జిల్లాకు 203 మంది గ్రామ పాలన అధికారులు అవసరమని రెవెన్యూ అధికారులు గుర్తించారు. సీసీఎల్‌ఏ నుండి కలెక్టరేట్‌కు వచ్చిన నిబంధనలు, సూచనల మేరకు పరీక్ష ఆధారంగా గ్రామ పరిపాలన అధికారుల జాబితా సిద్ధం చేశారు.
గవర్నర్‌ను కలిసిన నారాయణరెడ్డి
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ కార్యవర్గ సభ్యుడు, రజాకార్ చిత్ర నిర్మాత గూడూరు నారాయణరెడ్డి గురువారం తెలంగాణ విమోచన దినోత్సవ కమిటీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు సి.అంజిరెడ్డితో వెళ్లి కలిశారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు.
అమృత్ పనుల్లో వేగం పెంచండి
సాక్షి,యాదాద్రి : అమృత్ పథకం పనులను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో పబ్లిక్‌హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షనిర్వహించారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో రూ.123.44 కోట్లతో అమృత్ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ నిధులతో చేపట్టిన మంచినీటి ట్యాంకులు, పైప్‌లైన్లు, అంతర్గత పైప్‌లైన్ల పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఇటీవల కాంట్రాక్టర్లకు రూ.22 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో పబ్లిక్‌హెల్త్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీఈ మనోరమ, ఏఈలు పాల్గొన్నారు.

నేడు గణేష్ నిమజ్జనం