
మరమ్మతులు చేపట్టాలి
సాక్షి,యాదాద్రి : మంచినీటి పైప్‌లైన్లకు మరమ్మతులు చేయించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలకు డ్రెయినేజీలు, రోడ్లతో పాటు మంచినీటి పైప్‌లైన్‌లు దెబ్బతిన్నాయన్నారు. వీటితో పాటు పాఠశాల, ఆస్పత్రి భవనాలు, అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు. ఇకపై ప్రతి గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. దరఖాస్తులు కూడా స్వీకరించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులను శుక్రవారం కలెక్టరేట్‌లో సన్మానించనున్నట్లు వెల్లడించారు.
ప్లాస్టిక్ నిషేధానికి పాటుపడుదాం
చౌటుప్పల్ : ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సి పల్ అడ్మినిస్ట్రేషన్) జాయింట్ డైరెక్టర్ నారాయణ రావు కోరారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం చౌటుప్పల్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం విషయంలో ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. దశాబ్దాలనాటి చెట్లను మన అవసరాలకు నరుకుతున్నామని, తిరిగి చెట్ల పెంపకం చేపట్టకపోవడంతో కరువు పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఇంటిపన్నుల వసూళ్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్‌రెడ్డి, మేనేజర్ అంజయ్య, శానిటరీ ఇన్స్‌పెక్టర్ హనుమాన్‌ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.