
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
గుండాల: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాములుగౌడ్(75)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక కుమారుడు, రెండో భార్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొదటి భార్య గతంలోనే అతడి నుంచి దూరంగా వెళ్లిపోగా.. రెండో భార్య సోమలక్ష్మితో కలిసి రాములుగౌడ్ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రాములుగౌడ్ కుటుంబంలో భూ తగాదాలు జరుగుతుండగా.. మనస్తాపానికి గురైన రాములుగౌడ్ బుధవారం రాత్రి తన పెద్ద కుమారుడు శ్రీను ఇంటి వెనుక భాగంలో ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం పెద్ద కుమారుడు శ్రీను చూసేసరికి రాములుగౌడ్ మృతిచెంది ఉన్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తేజమ్‌రెడ్డి తెలిపారు.