
అభిమానానికి నిలువెత్తు రూపం
భూదాన్‌పోచంపల్లి: సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ, రాజకీయ నాయకులను విగ్రహాలను పెట్టడం చూస్తుంటాం. కానీ భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామస్తులు మాత్రం ఓ ఉపాధ్యాయుడి విగ్రహాన్ని గ్రామంలో పెట్టి, ఆయన చేసిన మంచి పనులు, సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలానికి చెందిన కొప్పుల దామోదర్‌రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు 42 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాల ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటం చూసి గ్రామస్తులు, దాతల సహకారంతో తరగతి గదులను ఏర్పాటు చేయించారు. అంతేకాక రోడ్డు బాగాలేక గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి రోడ్డును బాగు చేయించారు. అదేమాదిరిగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చి స్కూటర్‌పై గ్రామానికి వస్తుండగా.. 1983 ఆగస్టు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో దామోదర్‌రెడ్డి మృతిచెందారు. ఆయన పాఠశాలకు, గ్రామంలో విద్యాభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ గ్రామస్తులంతా కలిసి పాఠశాల ఆవరణలో గాంధీ, నెహ్రూ విగ్రహాల సరసన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాక కొప్పుల దామోదర్‌రెడ్డి పేరిట విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు, బహుమతులు, వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేసి నాలుగు దశాబ్దాలుగా గురు భక్తిని చాటుకుంటున్నారు.