
గోశాల విస్తరణకు స్థల పరిశీలన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన గోశాల విస్తరణకు గాను టెంపుల్ సిటీపై స్థలాన్ని ఈఓ వెంకట్రావ్ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం ఆలయ గోశాలను మల్లాపురం గ్రామానికి వెళ్లే రోడ్డులో దేవస్థానం తోటలో నిర్వహిస్తున్నారు. దీనిని విస్తరించేందుకు టెంపుల్ సిటీపై గోశాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఈఓ వెల్లడించారు. అనంతరం టెంపుల్ సిటీపై వేద పాఠశాలకు సంబంధించిన స్థలంలో చేస్తున్న పనులను పరిశీలించారు. వేద పాఠశాల నిర్మాణంపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అక్కడే జరుగుతున్న భూముల సర్వేను పరిశీలించి, వైటీడీఏ పరిధిలోని భూములను పకడ్బందీగా నిర్వహించాలని సర్వేయర్లకు తెలిపారు. కొండపైన భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ బ్రిడ్జి ఏర్పాటు కోసం అధికారులు, అర్చకులతో చర్చించి, పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.