
కొత్త జాబితాతోనే..!
రెండు విడతల్లో ఎన్నికలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనున్నాయి. జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ నిర్వహణకు పీఓలు, ఏపీఓలు 6,708 మందిని ఇప్పటికే ఎంపిక చేసింది. వీరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. 600 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పొలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఎనిమిది గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయ్యాయి. మోత్కూరు మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం కొత్తగా ఏర్పాటు చేశారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని సాయినగర్.. హైదరాబాద్ పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీలో విలీనమైంది.
సాక్షి, యాదాద్రి: పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావించిన అధికారులు.. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ పత్రాలు, నమూనా బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేయడంతో పాటు పీఓలు, ఏపీఓలను కూడా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి పోలింగ్ సామగ్రిని సరి చూసుకోవడం, ఇతర ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలైంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో మరోమారు జాబితా రూపకల్పన చేస్తున్నారు.
అర్హులందరికీ ఓటు హక్కు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో వినియోగించే ఓటరు జాబితాను మరోసారి అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల నాటి జాబి తాను అనుసరించి జాబితా సిద్ధం చేయాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లన్నీ ఒకే వార్డులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు అర్హత కలిగిన ఓటర్లను వార్డుల వారీగా ఓటరు జాబితాల్లో చేర్చే పనిలో ఉన్నారు. ఈ జాబితా ఆధారంగా పరిషత్, పంచాయతీ ఎన్నికల సమరానికి ప్రభుత్వం వెళ్లనుందని తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధమైన జాబితా ప్రకారం జిల్లాలో 5,32,498 మంది ఓటర్లు ఉన్నారు. నూతన జాబితా ద్వారా మరికొందరు పెరిగే అవకాశం లేకపోలేదు.
నేడు కలెక్టర్ సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లాస్థాయిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రణాళిక సిద్ధం చేశారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన పీఓలు, ఏపీఓలు, ఇతర సి బ్బంది, పోలీసు యంత్రాంగం, బ్యాలెట్ బాక్స్‌లు తదితర వాటిని సిద్ధం చేశారు. 30 రకాల గుర్తులతో నమూనా బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి చేశారు. బ్యాలెట్ పేపర్లు, నామినేషన్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. గురువారం (నేడు) కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులు సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు
ఫ ఈసీ ఆదేశాలతో మరోసారి
ఓటరు జాబితా రూపకల్పన
ఫ పంచాయతీ కార్యదర్శులకు లాగిన్
ఫ ఈనెల 22నుంచి మొదలైన ప్రక్రియ
ఫ ఇప్పటికే నామినేషన్ సామగ్రి సిద్ధం
ఓటర్లు 5,32,498
మహిళలు 2,67,729
పురుషులు 2,64,765
ఇతరులు 04
గ్రామ పంచాయతీలు 427
వార్డులు 3,704
పోలింగ్ కేంద్రాలు 3,704
బ్యాలెట్ బాక్స్‌లు 1,900
ఎంపీటీసీలు 178
జెడ్పీటీసీలు 17
పోలింగ్ కేంద్రాలు 995
స్థానిక ఎన్నికల్లోనూ ‘నోటా’
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నోటాకు స్థానం దక్కనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే కనిపించే నోటా గుర్తును మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పరిషత్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు చేర్చనున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ఏ అభ్యర్థి తమకు నచ్చలేదని ఓటర్ భావిస్తే.. నోటా గుర్తుకు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది.

కొత్త జాబితాతోనే..!