
43 మంది స్కూల్ అసిస్టెంట్‌ల సర్దుబాటు
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యాశాఖ చేపట్టిన సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తొలుత స్కూల్ అసిస్టెంట్ల(ఎస్‌ఏ)ను సర్దుబాటు చేశారు. 44 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వా రంతా గురువారం తమకు కేటాయించిన పాఠశాలలకు వెళ్లి విధుల్లో చేరారు. ఇక ఎస్‌జీటీల సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తొలుత పాఠశాల కాంప్లెక్స్, ఆ తర్వాత మండల స్థాయిలో ఎస్‌జీటీలను సర్దుబాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 60 నుంచి 70 మందిని సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్వర్ణగిరీశుడికి తిరుప్పావడ సేవ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవెంకటేశ్వరస్వామి స్వామివారికి గురువారం తిరుప్పావడ సేవ నేత్రపర్వంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారికి 450 కిలోల అన్నప్రసాదం, లడ్డూ, వడ, ఇతర పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు.అంతకు ముందు వేకువజామున సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ఆలయ మాడవీధుల్లో స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర హారతులు సమర్పించారు.
‘విదేశీ విద్యానిధి’కి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు 2025–2026 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జినుకల శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు telanganaepass.gov.in ద్వారా ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉపకార వేతనాలకు..
2025–26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌మెట్రిక్ వేతనాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి జినుగుల శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు telanganae pass.cgg.gov.in వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆధార్‌తో అనుసంధానం ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలను దరఖాస్తు ఫారంలో నమోదు చేయాలన్నారు.
గెస్ట్ అధ్యాపక పోస్టులకు..
భువనగిరి: మండలంలోని అనంతారం పరిధిలోని పూలే గురుకుల డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ స్వప్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, హిందీ, గణితం సబ్జెక్టుల్లో బోధించేందుకు అర్హత కలిగిన వారు నెల 26లోపు కళాశాలలో దరఖాస్తులను అందజేయాలని కోరారు. డిగ్రీ, బీఈడీ, పీజీలో 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9652094994, 9505110024 సంప్రదించాలని కోరారు.
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు చివరి తేదీ 31
యాదగిరిగుట్ట: ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు ఈ నెల 31వరకు అవకాశం ఉందని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కె.శరత్ యామిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యలో బడి మానేసిన యువతీయువకులు నేరుగా 10వ తరగతి పరీక్షలు రాసేందుకు, ఇంటర్ పూర్తి చేయడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఈ అవకాశం కల్పిస్తుందన్నారు.