
అతివల్లో అక్షర చైతన్యం!
ఫ స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యుల గుర్తింపు
ఫ 29,497 మందికి చదువు చెప్పేందుకు కార్యాచరణ
ఫ ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు అందజేత
ఫ బోధనకు వలంటీర్ల నియామకం
ఫ త్వరలో తరగతులు ప్రారంభం
యాదగిరిగుట్ట రూరల్: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) పథకం ద్వారా చేపట్టిన సర్వే ముగిసింది. విద్యాశాఖ, డీఆర్‌డీఓ సంయుక్తంగా చేపట్టిన సర్వే ద్వారా 29,497 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు అందజేసి, వలంటీర్లను నియమించి అక్షరజ్ఞానం కల్పించనున్నారు. అదే విధంగా వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన మహిళలను తెలంగాణ ఓపెన్ స్కూల్, ఇంటర్, డిగ్రీ విద్యను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో సంఘాలు, సభ్యులు
జిల్లాలో 14,000 స్వయం సహాయక సంఘాలు, అందులో 1,55,000 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరికి అక్షరాస్యత లేకపోవడం వల్ల సంఘాలు నిర్వహించే లావాదేవీలపై సరైన అవగాహన ఉండటం లేదు. పొదుపుసంఘాల ఆర్థికాభివృద్ధికి రుణాలు, ఇతరత్రా రూపాల్లో తోడ్పాటునందిస్తున్న ప్రభుత్వం.. వారిని అక్షరాస్యతపరంగానూ బలోపేతం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా చదవడం, రాయడం రాని మహిళలను గుర్తించడానికి జూన్ 1నుంచి 30వ తేదీ వరకు నెలరోజుల పాటు సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాల్లో 29,497 మంది నిరక్షరాస్యులైన మహిళలు ఉన్నారని ఐకేపీ అధికారులు, వీఓఏలు గుర్తించారు. వీరందరి వివరాలను ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశారు.
వలంటీర్లతో బోధన
నిరక్షరాస్యులకు బోధన చేయడానికి ఆయా గ్రామాల్లోని రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్లు, అశా కార్యకర్తలు, స్వయం సహాయక గ్రూప్ లీడర్లను వలంటీర్లుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వలంటీర్లకు ప్రత్యేకంగా ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. రోజుకు రెండు గంటలు చొప్పున ప్రణాళిక ప్రకారం ఆయా గ్రామాల్లో నిరక్షరాస్యులైన మహిళలకు వీరు బోధన చేస్తారు.
వంద శాతం అక్షరాస్యత లక్ష్యం
స్వయం సహాయక సంఘాల మహిళల్లో 100 శాతం అక్షరాస్యత తీసుకురావాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నాం. రాబోయే ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లోని సంఘాల్లో నిరక్షరాస్యులు లేకుండా చేయడమే లక్ష్యం. సర్వే ద్వారా గుర్తించిన నిరక్షరాస్య మహిళలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి.
–నర్సింహారెడ్డి, వయోజన విద్య అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా
నేడు ఏపీఎంలతో సమావేశం
యాదగిరిగుట్ట రూరల్: స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి రూపొందించిన కార్యాచరణలో భాగంగా డీఆర్డీడీఏ, విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఏపీఎంలతో సమావేశం ఏర్పాటు చేశారు. నిరక్షరాస్య మహిళలకు అవగాహన కల్పించడం, 100 శాతం అక్షరాస్యత వంటి ప్రధానాంశాలపై ఏపీఎంలకు అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఏపీఎంలు తమ మండల పరిధిలోని వీఓఏలు, వలంటీర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

అతివల్లో అక్షర చైతన్యం!