
వర్షం.. పత్తి చేలకు జీవం
రామన్నపేట: అదును దాటుతున్నా సరైన వర్షాలు లేక కలవరపడుతున్న కర్షకులకు ఊరట లభించింది. వారం రోజులుగా కురుస్తున్న మోస్తరు వానలు పత్తితో పాటు ఆరుతడికి ప్రాణం పోసినట్లయింది. వాడు దశకు చేరిన చేలు నిగనిగలాడుతున్నాయి.
98వేల ఎకరాల్లో పత్తి సాగు
ఈ ఏడాది జిల్లాలో లక్షా 15 వేల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 98 వేల ఎకరాల్లో సాగైంది. కాగా మే నెలాఖరులో, జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు సుమారు 20వేల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు వేశారు. ఆ తరువాత చినుకు జాడ లేకపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో ఒక్కో రైతు రెండు, మూడు పర్యాయాలు గింజలు విత్తాల్సి వచ్చింది. అడపాదడపా కురిసిన వర్షాలకు మొలిచిన మొక్కలు సరైన పోషకాలు అందక ఎదుగుదల నిలిచిపోయింది.ఎండతీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల చేలు వాడుపట్టాయి. ఈ తరుణంలో కురుస్తున్న వానల వల్ల చేలకు ప్రాణం పోసినట్లయింది.
వ్యవసాయ పనుల్లో నిమగ్నం
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు.
సాళ్లలో విత్తనాలు మొలకెత్తని చోట తిరిగి విత్తడం, కలుపు తీయడం, గుంటుకలు తోలడం, ఎరువులు పెట్టే పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక్కసారిగా వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో కూలీల కొరత ఏర్పడింది. మూసీ పరీవాహక ప్రాంతాల నుంచి కూలీలను రైతులు ఆటోల్లో తీసుకెళ్తున్నారు. చార్జీలు కూడా రైతులే భరిస్తున్నారు.
ముసురు, చలి గాలులు
భువనగిరిటౌన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ముసురుతో పాటు చల్లటి గాలులు వీచాయి. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదయ్యాయి. నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వర్షం.. పత్తి చేలకు జీవం