
బిల్లులురావు.. పనులు సాగవు!
సాంకేతిక సమస్యలతో లబ్ధిదారులకు తిప్పలు
ఇతని పేరు ఊర బయ్యన్న. మోత్కూర్‌లోని జంగాల కాలనీలో గల సొంత స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాడు. సొంత నగదు లక్ష రూపాయలతో పాటు మరో రూ.50వేలు అప్పు తెచ్చి బేస్మెంట్ వరకు పూర్తి చేశాడు. బేస్మెంట్ పూర్తై నెల రోజులు అవుతుంది. వారం క్రితం అధికారులు వచ్చి ఫొటోలు తీసుకెళ్లారు. సోమవారం అతని ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. బిల్లు రాకపోవడంతో లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం ఆపేశాడు.
సాక్షి యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్లలో తప్పులు, పేరు మార్పు, యాప్‌లో ఫొటో అప్‌లోడ్ కాకపోవడం తదితర సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా సకాలంలో బిల్లు అందక ఇంటి నిర్మాణానికి ఆటంకంగా మారుతోంది. చాలా చోట్ల బేస్మెంట్ స్థాయిలో పనులు నిలిచిపోయాయి.
సమస్యలు ఇవీ..
ఇందిరమ్మ ఇంటికి ముగ్గుపోసే సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈ వచ్చి స్థలాన్ని ఐదు రకాలుగా ఫొటోలు తీయాలి. బేస్మెంట్ వరకు పూర్తయిన అనంతరం మరోమారు వచ్చి ఐదు రకాల ఫొటోలు తీసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. కానీ, ఫొటోలు అప్‌లోడ్ చేసేటప్పుడు ప్లీజ్ నియర్‌బై లోకేషన్ అని వెబ్‌సైట్‌లో చూపుతుంది.
● ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరున మంజూరు చేస్తారు. కానీ, ప్రజాపాలన గ్రామ సభల్లో చాలా మంది పరుషుల పేరున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మహిళల పేరున మార్చే సమయంలో టెన్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు లబ్ధిదారు పేరు, ఇంటి పేరు, ఆధార్‌కార్డులో అక్షర దోషాల కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎంపీడీఓలు తమ లాగిన్ నుంచి సరిచేసి కలెక్టర్ లాగిన్‌న్‌లోకి పంపిస్తారు. తప్పులను సరిచేస్తే సదరు లబ్ధిదారు ఇంటి వివరాలకు సంబంధించిన సమాచారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సెల్‌ఫోన్‌కు వస్తుంది. అప్పుడు కార్యదర్శి మరోసారి బేస్మెంట్ వద్దకు వెళ్లి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇదే సమయంలో హౌసింగ్ ఏఈ కూడా వచ్చి బేస్మెంట్ కొలతలు తీయాలి. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతుందని నిర్ధారించాలి. ఇంటి నిర్మాణ ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇలా ప్రతి బుధవారం వరకు అప్‌లోడ్ చేస్తే సోమవారం తర్వాత లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అయితే గృహ నిర్మాణ శాఖనుంచి బిల్లులు మంజూరు చేసినా క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యల వల్ల నగదు జమ కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
● ఆధార్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు ప్రొసిడింగ్, బ్యాంకు ఖాతాలోని పేరులో ఒక్క అక్షరం తేడా ఉన్నా సమస్య ఏర్పడుతుంది. గతంలో తీసిన కొన్ని జీరో అకౌంట్ నంబర్లు మనుగడలో లేనట్లు చూపుతున్నాయి. ఇక కెనెరా బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులోఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ సమస్య తలెత్తుతోంది.
ఫ పనిచేయని బ్యాంకు ఖాతాలు
ఫ అప్‌డేట్ కాని ఆధార్ వివరాలు
ఫ గూగుల్ ఫొటోలకూ అవస్థలే..
ఫ బేస్మెంట్ వరకు పూర్తయినా అందని బిల్లులు
ఫ చేతినుంచి ఖర్చు చేయలేక
ఇళ్ల నిర్మాణాల నిలిపివేత
పీఎంఏవై యాప్‌లోనూ అప్‌లోడ్ కాని వివరాలు
ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే రూ.5లక్షల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రూ.2లక్షలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వివరాలను పంచాయతీ కార్యదర్శులు వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ముందుగా పంచాయతీ కార్యదర్శి ఐరిష్‌తో వెబ్‌సైట్ ఓపెన్‌న్ చేయాలి. అనంతరం లబ్ధిదారు ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు, ప్రభుత్వం అడిగిన పూర్తి వివరాలతో పాటు లబ్ధిదారు ఐరిష్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. వీటితో పాటు ఇందిరమ్మ ఇంటి ఫొటోతోపాటు అంతకుముందు ఎక్కడ నివసించాడనే వివరాలను సైతం అప్‌లోడ్ చేయాలి. అయితే పలువురు లబ్ధిదారులు పాత ఇంటిని తొలగించి ఆ స్థానంలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. దీంతో కేంద్రం వైబ్‌సైట్‌లో లబ్ధిదారు వివరాలు అప్‌లోడ్ కావడంలేదు.
సమస్యలు పరిష్కరిస్తున్నాం
ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నది వాస్తవమే. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. సుమా రు 600 మంది లబ్ధిదారులకు సాంకేతిక సమస్యలు రాగా.. 400 వరకు పరిష్కరించి బిల్లుల కోసం అప్‌లోడ్ చేశాం. మిగతా ఇళ్ల సమస్యలు పరిష్కరిస్తున్నాం. కేంద్రానికి సంబంధించిన యాప్‌లోనూ ఇళ్ల వివరాలు ఆప్‌లోడ్ చేస్తున్నాం. జిల్లాలో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది.
–విజయ్‌సింగ్, హౌసింగ్ పీడీ

బిల్లులురావు.. పనులు సాగవు!