
సాగర్ వెనుక జలాల్లో మునిగి యువకుడి మృతి
చందంపేట: నేరెడుగొమ్ము మండలంలోని వైజాక్ కాలనీలో సాగర్ వెనుక జలాల్లో మునిగి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన మచ్కూరి అనిల్‌కుమార్(26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నలుగురితో కలిసి అనిల్‌కుమార్ శనివారం వైజాక్ కాలనీని సందర్శించేందుకు వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున స్నానం చేసేందుకు సాగర్ వెనుక జలాల్లోకి దిగి నీట మునిగి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అనిల్‌కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వాహనం ఢీకొని..
చివ్వెంల(సూర్యాపేట): విజయవాడ–హైదరాబాద్ హైవే పై చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి(35) హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712686031 నంబర్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
బైక్‌లు చోరీ చేస్తున్న మైనర్
● జువైనల్ హోంకు తరలింపు
మోత్కూరు: బైక్‌లు చోరీ చేస్తున్న బాలుడిని మోత్కూరు పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణానికి చెందిన మత్స్యగిరి, వేమల్‌రెడ్డి తమ బైక్‌లు చోరీకి గురైనట్లు జూన్ 29న మోత్కూరు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. తన దగ్గర సెంట్రింగ్ పని చేసేందుకు వచ్చిన బాలుడు తన బైక్ దొంగిలించాడని మత్స్యగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మత్స్యగిరి ఫిర్యాదులో పేర్కొన్న బాలుడు మోత్కూరు కొత్త బస్టాండ్ వద్ద శనివారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. రెండు బైక్‌లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు మైనర్ అయినందున జువైనల్ హోంకు తరలించారు.
ఎర్ర జెండాలు పాతి
స్థలం స్వాధీనం
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని సర్వే నంబర్ 700లో 2005లో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన స్థలంలో ఆదివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఎర్ర జెండాలు పాతి గుడిసెలు వేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ.. 2005లో పేదలకు కాగితాలు ఇచ్చి 20 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా ఇంటి స్థలాన్ని కేటాయించలేదని ఆరోపించారు. లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరిగినా స్పందించకపోవడంతో గుడిసెలు వేసినట్లు తెలిపారు. భువనగిరి పట్టణంలో ఎంతోమంది ఇళ్లు లేని పేదలు ఉన్నారని.. అర్హులకు ఇంటి స్థలం చూపించి ఇళ్ల నిర్మాణం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, బర్లవెంకటేశం, వల్దాస్ అంజయ్య, రాహుల్, రియాజ్, సాజిత్, నరాల నరసింహ, కొత్త లలిత, కొత్త లక్ష్మయ్య, అరుణ, మంజుల, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సాగర్ వెనుక జలాల్లో మునిగి యువకుడి మృతి