
అత్యధికంగా భూ సమస్యలపైనే..
సాక్షి, యాదాద్రి: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి వినతిపత్రాలు అందజేశారు. వివిధ సమస్యలపై 48 అర్జీలు రాగా.. అందులో భూ సమస్యలకు సంబంధించి 34 ఉన్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇతర జిల్లా ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు అందిన
దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వండి
ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఆయా వర్గాల నుంచి అందిన వినతులకు ప్రాధాన్యమిచ్చి త్వరగా పరిష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని, వనమహోత్సవం కార్యక్రమంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల నుంచి చాలా మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన విద్య అందించాలన్నారు.
పాస్ పుస్తకం ఇప్పించాలని వినతి..
పాస్ పుస్తకం ఇప్పించాలని బొమ్మలరామరం మండల కేంద్రానికి చెందిన ముక్కెర్ల బాలయ్య కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పక్కనే ఉన్న పేలుడు పదార్థాల కంపెనీ యజమాని తన భూమి అమ్మాలని వత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కంపెనీ యజమానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని, తనకు న్యాయం చేయాలని విన్నవించారు. విచారణ చేయాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు.
ఫ ప్రజావాణికి 48 అర్జీలు
ఫ వినతులు స్వీకరించిన కలెక్టర్