
మనసున్న మారాజులు ఆదుకోరూ..
నార్కట్‌పల్లి: కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాలు.. నార్కట్‌పల్లి మండలం తొండల్‌వాయి గ్రామానికి చెందిన మేడిపల్లి నర్సింహకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వారిలో ఒక కుమారుడు మృతిచెందగా.. మరో కుమారుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు మేడిపల్లి శంకర్ 20ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడే కుల వృత్తిలో భాగంగా సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో హైదరాబాద్‌లోనే లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారు.
రెండేళ్ల నుంచి అనారోగ్యంతో..
మేడిపల్లి శంకర్ రెండేళ్ల క్రితం మెడ నరాల నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్లగా.. మెడ నరాలకు కండ పెరిగిందని వైద్యులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని, సొంతూరు తొండల్‌వాయికి వచ్చారు. స్వగ్రామంలో ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో దిగారు. కొన్నిరోజుల తర్వాత శంకర్ నడుచుకుంటూ వెళ్తుండగా.. కిందపడడంతో తుంటి ఎముక పక్కకు తొలగింది. ఫిజియోథెరపీ చేయించుకున్నా అది సరికాకపోవడంతో డాక్టర్లను సంప్రదించాడు. డాక్టర్లు పరిశీలించి ఆపరేషన్ చేస్తే ఎముక సరైన స్థానానికి వస్తుందని, ఆపరేషన్‌కు రూ.4లక్షలు అవుతాయని చెప్పగా.. డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోకుండా ఆగిపోయాడు. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం అతడి కుమార్తె ఇంటర్, కుమారుడు పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. శంకర్ భార్య కూలీ పనికి వెళ్లగా వచ్చే డబ్బులతో కుటుంబం గడుస్తోంది. తమకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాలేదని, ఇతర ప్రభుత్వ పథకాలు అందడంలేదని, మనసున్న మారాజులు ఆపన్న హస్తం అందిస్తే శంకర్‌కు ఆపరేషన్ చేయిస్తామని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
అనారోగ్యంతో మంచానికే
పరిమితమైన ఇంటి పెద్ద
భారంగా మారిన కుటుంబ పోషణ

మనసున్న మారాజులు ఆదుకోరూ..