
గంజాయి విక్రేతల రిమాండ్
సూర్యాపేటటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన పది మంది యువకులు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారిలో పిట్టల నాగరాజు, ఆది వంశీ జూన్ 30న సూర్యాపేట నుంచి బస్సులో ఖమ్మంకు వెళ్లి.. అక్కడి నుంచి రైలులో ఏపీలోని విశాఖపట్నం సమీపంలోని అరకు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ 12కిలోల గంజాయిని ఒక్కో కిలో రూ.2వేలు చొప్పున కొనుగోలు చేశారు. ఈ గంజాయి కొనుగోలు చేయడానికి పది మంది యువకులు కలిసి ఒక్కొక్కరు రూ.3వేల చొప్పున వేసుకున్నారు. నాగరాజు, వంశీ కలిసి ఆ గంజాయిని తీసుకొని ఈ నెల 3న సూర్యాపేటకు వచ్చి నాగరాజు ఇంట్లో దాచిపెట్టారు. ఆ గంజాయిని అందరికీ పంచేందుకు నల్లచెరువుకట్ట వద్దకు రమ్మనగా వారందరూ గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. నాగరాజు నల్లచెర్వుకట్ట వద్దకు బైక్‌పై గంజాయితో రాగా.. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా సీసీఎస్, పట్టణ సీఐ వెంకటయ్య తన సిబ్బందితో దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో పిట్టల నాగరాజు, అంగోతు వంశీ, రెడ్డిపల్లి మధుసూదన్, కూతురు ఆకాశ్, శూర శ్రవణ్‌కుమార్, గుండారపు శివ ఉండగా వారిని రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు ఆది వంశీ, విశ్వనాథుల సాయికుమార్, దోసపాటి వంశీ, సారగండ్ల శివకార్తీక్ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. నిందిధితుల నుంచి 11.780కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దోరకుంటలో గంజాయి పట్టివేత..?
కోదాడరూరల్: కోదాడ మండలం దోరకుంటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి పోలీసులు 10 కేజీల గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేయగా ఓ వ్యక్తి వద్ద కొంత మేర గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. సదురు వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తి వద్ద 9 కేజీల గంజాయి పట్టుబడినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఫ 11.780 కిలోల గంజాయి స్వాధీనం
ఫ పరారీలో మరో నలుగురు