ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ
కోదాడరూరల్ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లుకు చెందిన ముత్తవరపు వెంకటరమణ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) వారు బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయనను ఎంపిక చేశారు. ఇండియాలో ఫార్మసీ ఎడ్యుకేషన్‌ను అభివృద్ధి చేయడం, నూతన కళాశాలల మంజూరుతో పాటు రెన్యువల్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించనున్నారు. కాపుగల్లుకు చెందిన ముత్తవరపు భాస్కర్‌రావు, కుమారి దంపతుల కుమారుడు వెంకటరమణ 10వ తరగతి వరకు కోదాడలోని సెయింట్ జోసెఫ్ సీసీరెడ్డి పాఠశాలలో, ఇంటర్మీడియట్ విజయవాడలోని విశ్వశ్రీ కళాశాలలో , బీఫార్మసీని కర్ణాటకలో, ఎం ఫార్మసీ అన్నామలై యూనివర్సిటీలో, పీహెచ్‌డీ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆయన ప్రస్తుతం మొయినాబాద్‌లోని ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌గా, నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కాపుగల్లు మాజీ సర్పంచ్ తొండపు సతీష్, పీఏసీఎస్ చైర్మన్ నంబూరి సూర్యం, రిటైర్డ్ హెచ్‌ఎం ముత్తవరపు రామారావు, హనుమంతరావు, గ్రామస్తులు అభినందించారు.


