స్పిల్‌వేను పరిశీలించిన నిపుణులు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వేను మరమ్మతుల నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న తర్వాత క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినప్పుడు అధిక ఒత్తిడితో స్పిల్‌వే మీద నుంచి జారి బక్కెట్ పోర్షన్ తాకి ఎగిసిపడతాయి. సుమారు 300 నుంచి 350 మీటర్ల ఎత్తు నుంచి అధిక ఒత్తిడితో నీరు పడటం కారణంగా స్పిల్‌వేపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వీటిని ప్రతి సంవత్సరం మరమ్మతులు చేపట్టకపోతే డ్యాం పటిష్టతకు ఆటంకం ఏర్పడుతుంది. సాగర్ డ్యాం స్పిల్‌వే మరమ్మతులకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఎంత ఖర్చు చేసినా ప్రతి ఏడాది క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల చేసిన తర్వాత స్పిల్‌వే దెబ్బతినడం.. మరలా మరమ్మతులు చేపట్టడం సర్వసాధారణమైంది. గతేడాది కూడా రూ.20కోట్లతో స్పిల్‌వేకు మరమ్మతులు చేపట్టారు. కానీ నీటి విడుదల తర్వాత స్పిల్‌వే దెబ్బతిని గుంతలు ఏర్పాడ్డాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నిపుణుల కమిటీ సమావేశమై శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఎంవైకే ఆర్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు కులదీప్ తివార్, ఏఎన్ శ్రీకాంత్‌రాజ్, ఆదిత్య విక్రం వర్మ, సుజిత్ చంద్ర, ఎంజీ ప్రశాంత్‌లు డ్యాంను సందర్శించి స్పిల్‌వేను పరిశీలించారు. వీరితో పాటు సాగర్ డ్యాం ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లిఖార్జునరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ సత్యనారాయణ ఉన్నారు. స్పిల్ వే మరమ్మతులకు ఎలాంటి మెటిరీయల్‌ను వినియోగించాలి, వాటి సామర్థ్యం ఎంతమేరకు తట్టుకోగలదు వంటి విషయాలపై అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా ఎంవైకే కంపెనీ ప్రతినిధులు సాగర్ స్పిల్‌వేను పరిశీలించారు. ఈ బృందం పూర్తిస్థాయి నివేదికను ఉన్నత స్థాయి ఇరిగేషన్ అధికారులకు అందజేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి, అందుబాటులో ఉన్న కాలాన్ని బట్టి స్పిల్‌వేకు మరమ్మతులు నిర్వహించనున్నారు. వీరి ప్రతిపాదనలను ప్రభుత్వం ఒప్పుకుంటే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు సమయం సరిపోదు కాబట్టి దెబ్బతిన్న స్పిల్‌వేపై ఉన్న గుంతలకు మరమ్మతులు చేపట్టనున్నారు. జలాశయం నిండి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల పూర్తయిన తర్వాత మరమ్మతులు చేసిన స్పిల్‌వే గుంతలు నీటి ప్రవాహాన్ని ఒత్తిడిని తట్టుకుని ఉండగల్గితే అప్పుడు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు.
ఫ సాగర్ డ్యాం ఇంజనీర్లతో కలిసి మరమ్మతులపై అధ్యయనం


