సిటీ స్కాన్ సేవలెప్పుడు?
ప్రైవేట్ ల్యాబ్‌లే దిక్కు..
● భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ తలకు సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరింది. సిటీ స్కాన్ తీయాలని వైద్యులు సూచిచండంతో ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లింది. రూ.5వేల వరకు ఖర్చు వచ్చినట్లు బాధితురాలు వాపోయింది.
● ఆలేరుకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వ్యాధి నిర్ధారణ కోసం ప్రైవేట్ ల్యాబ్‌లో సిటీ స్కాన్ తీయించుకోగా రూ.4వేల వరకు తీసుకున్నారని వాపోయాడు. ప్రైవేట్‌లో సీటీ స్కాన్ కోసం వేలాది రూపాయలు చెల్లించాల్సి రావడం పేద రోగులకు భారంగా మారింది. ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి వస్తే రోగులకు బాధలు తప్పనున్నాయి.
భువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రికి నిత్యం 500కుపైగా రోగులు వస్తుంటారు. 100 పడకలు సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో అనేక విభాగాల్లో ఇన్‌పేషెంట్‌లకు నిత్యం సేవలందిస్తున్నారు. న్యూరాలజీ, మోకాల నొప్పులు, తల, ఎముకలు, శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత తదితర వ్యాధులకు సంబంధించి సిటీ స్కాన్ పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి. ఆస్పత్రికి రెండు నెలల క్రితం నూతనంగా సీటీ స్కాన్ మిషన్ మంజూరైనా సేవలు అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా స్కానింగ్ అవసరమైన రోగులకు ప్రైవేట్ ల్యాబ్‌లే దిక్కవుతున్నాయి.
రూ.2.5 కోట్లతో యంత్రం కొనుగోలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జెడ్ భువనగిరిలోని జిల్లా ఆస్పత్రి సందర్శనకు వచ్చిన సమయంలో ఆస్పత్రికి సిటీ స్కాన్ అవసరమని గుర్తించారు. ఆమె ఆదేశాల మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రతిపాదనలు రూపొందించి వైద్యారోగ్య శాఖకు పంపగా.. సిటీ స్కాన్ యంత్రాన్ని మంజూరు చేసింది. ఈ యంత్రం రెండు నెలల క్రితమే ఆస్పత్రిలోని తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్‌కు చేరినా వినియోగంలోకి తేవడం లేదు. దీని విలువ రూ.2.5 కోట్ల వరకు ఉంటుంది.
నెలలు గడుస్తున్నా మంజూరుకాని
విద్యుత్ కనెక్షన్
ప్రస్తుతం ఆస్పత్రికి విద్యుత్ సరఫరా జరుగుతున్న లైన్ సామర్థ్యం సిటీ స్కాన్ యూనిట్ నిర్వహణకు సరిపోదు.హై టెన్షన్ విద్యుత్ కనెక్షన్ కోసం వైద్యాధికారులు ట్రాన్స్‌కోకు దరఖాస్తు చేశారు. దీనికోసం సుమారు రూ.11 లక్షల వరకు అంచనా వ్యయంతో ప్రతిపాదించారు. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు చలాన్ కట్టకపోవడంతో అనుమతి రాలేదని తెలుస్తోంది.
టెక్నీషియన్ల నియామకానికి ప్రతిపాదనలు
సిటీ స్కాన్ నిర్వహణకు రేడియాలజిస్ట్ అందుబాటులో ఉండగా ఇంకా నలుగురు టెక్నీషియన్లు కావాలి. వీరి నియామకానికి వైద్యాధికారులు ప్రతి పాదనలు పంపారు.
నిరుపయోగంగా రూ.2.5 కోట్ల యంత్రం
జిల్లా కేంద్ర ఆస్పత్రికి
రెండు నెలల క్రితమే చేరిక
వినియోగంలోకి తేవడంలో జాప్యం
ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న రోగులు
విద్యుత్ కనెక్షన్ అనుమతి రాలేదు
సీటీ స్కాన్ యూనిట్ నిర్వహణకు గాను హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేశారు. అనుమతి రాగానే సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. అదే విధంగా ప్రత్యేకంగా నలుగురు టెక్నీషియన్లు అవసరం ఉండగా సబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపాం.
–వెంకటేశ్వర్లు జిల్లా కేంద్ర ఆస్పత్రి
సూపరింటెండెంట్


