
‘ఇస్రో’ శిక్షణ తరగతులకు ఎంపిక
కోదాడ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూన్ 23 నుంచి 27 వరకు రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంపై నిర్వహించనున్న శిక్షణ తరగతులకు కోదాడ పట్టణంలోని తేజ విద్యాలయంకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఏసిరెడ్డి శ్రీవల్లి, తూనుగంట్ల సమజ్ఞ ఎంపికయ్యారు. వీరికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహడ్రూన్‌లో గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ ఉస్తేల రమాసోమిరెడ్డి బుధవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
అధ్యాపకుల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని సర్వేల్ గురుకుల కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సతీష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగ్లిష్ మాధ్యమంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రంతో పాటు సంస్కృతం సబ్జెక్టులు బోధించడానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99899 51824 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
వృద్ధురాలి మెడలో
బంగారు గొలుసు చోరీ
చౌటుప్పల్ రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కోని పారిపోయారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైతాపురం గ్రామానికి చెందిన గోపనబోయిన యశోద దండుమల్కాపురం గ్రామంలో తమ బంధువుల వెళ్లి వస్తుండగా.. ఖైతాపురం గ్రామంలోకి రాగానే వర్షం పడింది. దీంతో ఆమె గ్రామ చౌరస్తాలో ఉన్న ఓ ఇంటి వద్ద కూర్చుంది. వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్తుండగా.. బైక్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని తులంన్నర బంగారు గొలుసు లాక్కోని పరారయ్యారు. వెంటనే యశోద కేకలు వేయడంతో గ్రామస్తులు బైక్‌పై పారిపోతున్న వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు దొరకకుండా హైదరాబాద్ వైపు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.
పిడుగు పడి
మహిళా రైతు మృతి
రామగిరి(నల్లగొండ): నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బంటుగూడెంలో బుధవారం మధ్యాహ్నం పిడుగుపడి మహిళా రైతు మృతిచెందింది. బంటుగూడేనికి చెందిన జాల బిక్షపమ్మ(46) తన వ్యవసాయ బావి వద్ద నిమ్మ తోటలో పనిచేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఈ సమయంలో ఆమైపె పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిడుగుపాటుకు ఇతర కూలీలు భయాందోళనకు గురయ్యారు.