లింగ నిర్ధారణ పరీక్షల కలకలం | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ పరీక్షల కలకలం

May 23 2025 3:18 PM | Updated on May 23 2025 3:18 PM

లింగ నిర్ధారణ పరీక్షల కలకలం

లింగ నిర్ధారణ పరీక్షల కలకలం

నకిరేకల్‌: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా కూడా కొందరు డబ్బులకు కక్కుర్తి పడి గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా నకిరేకల్‌ పట్టణంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్‌లోని ఓ స్కానింగ్‌ సెంటర్‌లో ఇటీవల లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకున్న మహిళ ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించుకుని తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. ఈ బాగోతం బయటపడడంతో సదరు స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు తన ఇంటికి తాళం వేసి పరార్‌ కావడం నకిరేకల్‌ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సూర్యాపేట జిల్లా మోతె గ్రామానికి చెందిన అనూష నకిరేకల్‌లోని ఓ స్కానింగ్‌ సెంటర్‌ లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుంది. తనకు అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మూడోసారి కూడా స్కానింగ్‌లో ఆడశిశువు అనే తెలియడంతో మూడు రోజుల క్రితం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించుకుంది. తీవ్ర రక్తస్తావం కావడంతో ఆమె మృతిచెందింది. ఈ విషయం బయటకు పొక్కడంతో అనూష భర్త నగేష్‌.. తన భార్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అబార్షన్‌ చేసిన ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేసి సీజ్‌ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు గురువారం నకిరేకల్‌ సీఐ రాజశేఖర్‌ తన సిబ్బందితో కలిసి నకిరేకల్‌లోని సదరు స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడి ఇంటికి వెళ్లగా.. అప్పటికే అతడు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

చాలాకాలంగా కొనసాగుతున్న దందా..

నకిరేకల్‌లో స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న వ్యక్తి గతంలో తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి భార్య లింగ నిర్ధారణ పరీక్షలపై మంచి అవగాహన పెంచుకుంది. స్కానింగ్‌ సమాచారం గర్భిణులకు తెలిపి వారి నుంచి సొమ్ము తీసుకుంది. ఈ విషయం తెలిసిన ఆ ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టర్‌ వారిద్దరిని బయటకు పంపించారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదై కాగా.. సదరు వ్యక్తి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక తన ఇంట్లోనే స్కానింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. వీరికి దాదాపు 5 నుంచి 8 మంది ఏజెంట్లు ఉన్నట్లు తెలిసింది. నెలకు 15 నుంచి 20 రోజుల పాటు గుట్టుచప్పుడు కాకుండా స్కానింగ్‌ చేస్తున్నారు. ప్రతిరోజు 10 నుంచి 15 మంది వరకు గర్భిణులకు పరీక్షలు చేసి ఒక్కొక్కరి నుంచి తమ ఏజెంట్ల ద్వారా రూ.35 వేలకు బేరం కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన భార్యతో స్కానింగ్‌ చేయించి అదే రూమ్‌లో దేవుళ్ల ఫొటోలు చూపించి కోడ్‌ రూపంలో గర్భవతి వెంట వచ్చిన బంధువులకు తెలియజేస్తారు.

నకిరేకల్‌లో నిబంధనలకు

విరుద్ధంగా స్కానింగ్‌

సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళ మృతితో వెలుగుచూసిన దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement