
మిర్యాలగూడలో చిరు వ్యాపారుల రాస్తారోకో
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో తోపుడు బండ్లను తొలగించడంతో తమకు న్యాయం చేయాలంటూ గురువారం చిరు వ్యాపారుల జడ్చర్ల–కోదాడ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. పండ్లను హైవేపై పోసి సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను మళ్లించారు. చిరు వ్యాపారులు మాత్రం ఎమ్మెల్యే, కమిషనర్ రావాలంటూ నినాదాలు చేశారు. మిర్యాలగూడ వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సీఐలు మోతీరాం, జె. సోమనర్సయ్య, పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐలు రాంబాబు, సైదిరెడ్డి, మల్లికంటి లక్ష్మయ్య, ఏఎస్‌ఐ చంద్రయ్య బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ సంతోష్ కిరణ్, మున్సిపల్ డీఈఈ వెంకన్న వారికి నచ్చజెప్పినా రాస్తారోకో విరమించలేదు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు మాట్లాడుతూ.. తాము చాలా ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, రోడ్డు పక్కన పెట్టుకున్న తోపుడు బండ్లను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు ఆందోళనను విరమించేదిలేదన్నారు. కనీసం ఫుట్‌పాత్ పైన అయినా బండ్లు ఏర్పాటు చేసుకుంటామన్నారు. మాజీ కౌన్సిలర్లు జావీద్, ఆలగడప గిరిధర్, జానీ వచ్చి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
తోపుడు బండ్లు తొలగించడంతో
కోదాడ–జడ్చర్ల హైవేపై ఆందోళన