వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి జైలుశిక్ష

May 16 2025 1:47 AM | Updated on May 16 2025 1:47 AM

వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి జైలుశిక్ష

వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి జైలుశిక్ష

చివ్వెంల(సూర్యాపేట): వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పి. లక్ష్మీశారద గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం దాచారం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్రీనివాస్‌కు అదే మండలం తుమ్మల పెన్‌పహాడ్‌ గ్రామ శివారులో 14 గుంటల భూమి ఉంది. అందులో 2 గుంటల భూమిని 2005లో తుమ్మల పెన్‌పహాడ్‌ గ్రామానికే చెందిన సల్లగుండ్ల బజార్‌కు విక్రయించాడు. దాని పక్కనే మరో 3 గుంటల భూమిని 2020లో బోట్యా తండాకు చెందిన గుగులోతు బుజ్జ మ్మకు విక్రయించాడు. 2020 జూన్‌ 16న బుజ్జ మ్మకు విక్రయించిన భూమిని కొలిచేందుకు గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులను తీసుకుని వెళ్లాడు. భూమిని కొలుస్తుండగా.. పక్కనే భూమి ఉన్న సల్లగుండ్ల బజార్‌, అతడి భార్య యల్లమ్మ, కుమారుడు పవన్‌, అల్లుడు ఎర్ర సుమన్‌ అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నారు. తమకు విక్రయించిన భూమికి వాస్తు కోసం ఇంకా కొంత భూమి ఇవ్వాలని బొమ్మగాని శ్రీనివాస్‌తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో నల్లగుండ్ల బజార్‌ బొమ్మగాని శ్రీనివాస్‌ గుండైపె బలంగా గుద్దడంతో శ్రీనివాస్‌ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని అక్కడే ఉన్న పెద్దమనుషులు సూర్యాపేటలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ విఠల్‌రెడ్డి సల్లగండ్ల బజార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంపల్లి లింగయ్య వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడు సల్లగుండ్ల బజార్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు లైజన్‌ ఆఫీసర్‌ గంపల శ్రీకాంత్‌, కోర్టు కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు సహకరించారు.

గుండెపోటుతో సీపీఎం నేత చిట్యాల బుచ్చిరెడ్డి మృతి

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్‌ నాయకుడు చిట్యాల బుచ్చిరెడ్డి గుండెపోటుతో గురువారం మృతిచెందారు. రామన్నపేట తాలుకాలో సీపీఎం నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషిచేశారు. గీత కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు. నక్సలైట్ల హిట్‌ లిస్ట్‌లో ఉన్నా కూడా ధైర్యంతో చౌటుప్పల్‌ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. బుచ్చిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం పంతంగి గ్రామంలో నిర్వహించనున్నట్లు సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి రత్నం శ్రీకాంత్‌ తెలిపారు. బుచ్చిరెడ్డి మృతదేహానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డితో పాటు సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండీ సలీం, భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ పాషా, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ చీరిక సంజీవరెడ్డి, నాయకులు బోయ యాదయ్య, అంతటి అశోక్‌ తదితరులు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement