
టెక్స్‌టైల్స్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
భూదాన్‌పోచంపల్లి, భువనగిరిటౌన్ : హ్యాండ్లూం టెక్స్‌టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 205–26 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల కాలం కోర్సు వ్యవధి ఉంటుందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూండ్లూమ్ టెక్నాలజీలో ఈనెల 16న కోర్సుపై అవగాహన సదస్సు ఉంటుందన్నారు.
గుట్ట క్షేత్రంలో డిజిటలైజేషన్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అన్ని విభాగాలు, కౌంటర్లను డిజిటలైజ్ (కంప్యూటరైజ్డ్) చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ వెంకట్రావ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఈగవర్నెన్స్ కమిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన, సులభతరమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రతి శుక్రవారం ప్రత్యేక బడిబాట
భువనగిరి: వేసవిలో ప్రతి శుక్రవారం ప్రత్యేక బడిబాట కార్యక్రమం నిర్వహించాలని డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 9,16,23,30 తేదీల్లో ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు అమ్మ అదర్శ కమిటీ సభ్యులతో కలిసి ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక బడిబాట నిర్వహించాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలను కలిసి బడిలో చేర్పించాలన్నారు. వారి తల్లిదండ్రులను సైతం కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామపెద్దలు, యువత సహకారంతో పిల్లలను బడిలో చేర్చేవిధంగా కృషి చేయాలని కోరారు.
ఐకేపీ ఏపీఎంకు అవార్డు
బీబీనగర్: ఐకేపీ బీబీనగర్ మండల ఏపీఎం శ్రీనివాస్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయించడంతో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అవార్డు దక్కింది. గురువారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
15 నుంచి సమ్మర్ క్యాంపులు
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15నుంచి వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6నుంచి 9వ తరగతి విద్యార్థులు క్యాంపులో పాల్గొనేందుక అవకాశం ఉంటుందని, జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. యోగాతో పాటు ఆటలపోటీలు, సీడ్‌బాల్ తయారీ, ఆర్ట్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ తయారీ వంటి వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వేసవి శిబిరాలు కొనసాగుతాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చెరువులను సర్వే చేయండి
భువనగిరిటౌన్ : హెచ్‌ఎండీఏ పరిధిలో 242 చెరువులు ఉన్నాయని, వీటిని సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ డీఈలు, ఏఈలో, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చెరువులతో పాటు కాలువలను సర్వే చేయాలన్నారు. సర్వే నివేదికను ప్ర భుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, పక్కాగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ డీఈ నరసింహ ఉన్నారు.