
వృద్ధురాలి కళ్లలో కారం చల్లి..
నేరేడుచర్ల: వృద్ధురాలి కళ్లలో కారం చల్లి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఈ ఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగింది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని గ్రంథాలయం వీధికి చెందిన వృద్ధురాలు గుండా చంద్రకళ ఇంటికి గురువారం గుర్తుతెలియని మహిళ వచ్చి తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగింది. దీంతో చంద్రకళ ఇంట్లోకి వెళ్లి బాటిల్‌లో నీళ్లు తీసుకొచ్చి ఆ మహిళకు ఇచ్చింది. ఆమె నీళ్లు తాగినట్లు చేసి బాటిల్ మూతను కింద పడేసింది. కిందపడిన బాటిల్ మూతను చంద్రకళ తీసేలోపే ఆమె కళ్లలో గుర్తుతెలియని మహిళ కారం చల్లి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును లాక్కోని పారిపోయింది. చంద్రకళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వివరాలు తెలుసుకున్నారు. చంద్రకళ కుమారుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మెడలోని పుస్తెలతాడు అపహరణ