
యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి నృసింహుడి జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గాను ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రధానాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
స్వస్తీవాచనంతో శ్రీకారం
శుక్రవారం ఉదయం 8.45గంటలకు ఆలయంలో స్వస్తీవాచనంతో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం జరిపిస్తారు. తర్వాత లక్ష కుంకుమార్చన నిర్వహించి, తిరు వేంకటపతి అలంకార సేవలో ఆలయ తిరు, మాఢ వీధుల్లో స్వామిని ఊరేగిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం జరిపించి గరుఢ వాహనంపై పర వాసుదేవ అలంకార సేవను ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగిస్తారు.
● శనివారం ఉదయం నిత్య నృసింహ మూలమంత్ర హవనములు, లక్ష పుష్పార్చన నిర్వహించి స్వామిని కాళీయమర్ధన అలంకార సేవలో ఊరేగిస్తారు. సాయంత్రం నృసింహ మూలమంత్ర హవనములు, నిత్య పూర్ణాహుతి జరిపి, హనుమంత వాహనంపై శ్రీరామావతారంలో అలంకార సేవ నిర్వహిస్తారు.
● ఆదివారం ఉదయం 7గంటల నుంచి నృసింహ మూలమంత్ర హవనములు, 8.30గంటల నుంచి 9గంటల వరకు మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం చేపడతారు. సాయంత్రం 7గంటలకు విశేష తిరువారాధన, అర్చన, వేద స్వస్తీ, నృసింహ ఆవిర్భావం, మహా నివేధన, తీర్థ ప్రసాద గోష్ఠితో ఉత్సవాలను ముగిస్తారు.
పాతగుట్ట ఆలయంలో
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం శుక్రవారం నుంచే జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.45గంటలకు స్వస్తీవాచనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, లక్ష కుంకుమార్చన జరిపిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం నిర్వహిస్తారు.
సంగీత మహాసభలు
జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో భజన, భక్తి సంగీతం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు.. కళాకారులకు సైతం ఆహ్వానం అందజేశారు.
ఆర్జిత సేవలు రద్దు
ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులచే నిర్వహించే నిత్య, శాశ్వత కల్యాణం, సుదర్శన హోమం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు వంటి ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. మూడుజుల పాటు భక్తులు ఇందుకు సహకరించాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ కోరారు.
నేడు ఉదయం 8.45 గంటలకు స్వస్తీవాచనంతో శ్రీకారం
ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, అర్చకులు

యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు