
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలంలో నల్లగొండ–గుండ్లపల్లి రహదారిలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యక్షాపురం గ్రామానికి చెందిన షేక్ మైబూషేన్(45) నల్లగొండకు వలస వచ్చి స్థానికంగా ఉంటూ.. నల్లగొండ నుంచి గుండ్లపల్లి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మైబూషేన్ డీజిల్ సప్లై చేసే వాహనం నడుపుకుంటూ గుండ్లపల్లి నుంచి నల్లగొండకు వస్తుండగా.. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పడంతో రహదారి పక్కన వ్యవసాయ భూమిలో ఉన్న సమాధులను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మైబూషేన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గురువారం మృతుడి భార్య రమిజాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపారు.
ఆటో ఢీకొని ఒకరు దుర్మరణం
మునుగోడు: బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఆటో ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మునుగోడు మండలం గూడపూర్ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిదేవిగూడేనికి చెందినా యంపల్ల నరేష్(30) బైక్‌పై నల్ల గొండకు వెళ్తుండగా.. గూడపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ రోడ్డుపై ఎగిరిపడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నరేష్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
యాదగిరిగుట్ట రూరల్: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆలేరు–వంగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు–యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామాల మధ్యన రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్‌పీ పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ ఇన్‌చార్జి కృష్ణారావు తెలియజేశారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. మహిళపై కేసు
నల్లగొండ: నల్లగొండ జిల్లా కోర్టులో మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని పారిపోయిన మహిళపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం తెలిపారు. కోర్టులో స్వీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గాజుల జ్యోతి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.50వేల చొప్పున 40 మంది వద్ద డబ్బులు వసూలు చేసి పరారైనట్లు డీఎస్పీ పేర్కొన్నారు. బాధితులు తిప్పర్తి, నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆయా స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చిన డీఎస్పీ సూచించారు.

రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి