
సుందరీమణుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: హైదరాబాద్‌లోని నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు సుందరీమణులు ఈ నెల 15వ తేదీన రానున్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు రానున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి డీసీపీ ఆకాంశ్ యాదవ్, ఈఓ వెంకట్రావ్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. కొండ పైన ఏర్పాట్లు ఎలా ఉండాలనే అంశాలను ఈఓతో కలెక్టర్, డీసీపీ చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందాల భామలకు పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కృషిచేయాలని ఆలయ అధికారులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రధానాలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. వారి వెంట ఏసీపీ సైదులు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆలయాధికారులు దోర్బాల భాస్కర్‌రావు, రఘు, రాజన్‌బాబు, దయాకర్‌రెడ్డి తదితరులున్నారు.
పోచంపల్లిలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
భూదాన్‌పోచంపల్లి: అందాల భామలు 15న పోచంపల్లికి కూడా రానున్న నేపథ్యంలో గురువారం పోచంపల్లిని స్పెషల్ బ్రాంచ్ డీసీపీ జి. నర్సింహారెడ్డి, ఏఆర్ డీసీపీ శ్యామ్‌సుందర్, అడిషనల్ డీసీపీ ఎం. వెంకట్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూధన్‌రెడ్డి, ఐటీ ఏసీపీ నరేందర్, ఎస్‌డబ్ల్యూ ఏసీపీ శైలజ్‌కుమార్, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి సందర్శించారు. టూరిజం పార్కు ప్రాంగణం, పార్కులోని మ్యూజియం, గదులు, స్టాల్స్ ఏర్పాటు ప్రదేశాన్ని పరిశీలించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో తీసుకోవల్సిన భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతురు, వారికి ఇచ్చే పాసులు, టూరిజం పార్కులో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను చౌటుప్పల్ ఏసీపీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు.
బుద్ధవనంలో మెడికల్ క్యాంపు..
నాగార్జునాసాగర్: నాగార్జుసాగర్‌ను ఈ నెల 12న అందాల భామలు సందర్శించనున్న నేపథ్యంలో బుద్ధవనంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన బుద్ధవనం, విజయవిహార్ అతిథి గృహాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ మెడికల్ క్యాంపుతో పాటు స్థానిక కమలా నెహ్రూ ఆస్పత్రిలో అత్యాధునిక మెడికల్ ఎక్విప్‌మెంట్‌తో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని అన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేశ రవి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ కృష్ణకుమారి, పెద్దవూర మండల వైద్యాధికారి నగేష్, విజయ విహార్ మేనేజర్ కిరణ్‌కుమార్, బుద్ధవనం ఈఓ రవిచంద్ర తదితరులు ఉన్నారు.

సుందరీమణుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు