
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
ఆత్మకూరు(ఎం) : భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వి.లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆత్మకూర్(ఎం) మండలాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందన్నారు. మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో నేటి నుంచి 15వ తేదీ వరకు సదస్సులు జరుగుతాయన్నారు. మొదటి రోజు సర్వేపల్లి, రాయిపల్లిలో రెవెన్యూ సదస్సులు ఉంటాయన్నారు. భూ సమస్యలున్న రైతులు నిర్దేశిత ఫారాలను నింపి రెవెన్యూ సదస్సుల్లో అందజేయాలని కోరారు. విచారణ జరిపి జూన్ 2న పరిష్కార పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.
ప్రజావాణి పునరుద్ధరణ
భువనగిరిటౌన్ : ప్రజా సమస్యల సత్వర పరి ష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమాన్ని నేటినుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ భారతి చట్టం అవగాహన సదస్సుల దృష్ట్యా ప్రజవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందన్నారు. సదస్సులు ముగిసినందున ప్రజావాణి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేసేందుకు రావచ్చన్నారు.
ఫాల్కే పురస్కారం ప్రదానం
చౌటుప్పల్ : పట్టణానికి చెందిన సినీ నిర్మాత చిరందాసు ధనుంజయ్య ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోసల్ జస్టిస్.. చిత్రానికి ఈయన నిర్మాతగా వ్యవహరించారు. ఉత్తమ నిర్మాత కేటగిరీలో పురస్కారానికి ఎంపికయ్యారు. అదే విధంగా ఉమా భవాని ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో రూపొందించి మరో లఘు చిత్రం ది అవార్డు 1996 జ్యూరీ అవా ర్డుకు ఎంపికైంది. దీంతో చిరందాసు ధనుంజయ్యను ది బెస్ట్ సోషల్ అవేర్‌నెస్ నిర్మాతగా ప్రకటించారు. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యాలయంలో ధనుంజయ్య అవార్డు అందుకున్నారు. అవార్డు లభించడం ఆనందంగా ఉందని, మరిన్ని చిత్రాలు నిర్మించేందుకుగాను నిచ్చెనలా పని చేస్తుందని తెలిపారు.
7 నుంచి క్రికెట్ కోచింగ్
భువనగిరి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈనెల 7వ తేదీ నుంచి నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్రికెట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యాంప్ ఇంచార్జ్ సయ్యద్ అమీనొద్దీన్ అదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. అండర్–14,16,19 విభాగాల్లో బాలబాలిలకు కోచింగ్ ఉంటుందన్నారు. రోజూ సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలక కోసం ఫోన్ నంబర్ 83413 13449ను సంప్రదించాలని కోరారు.