
ధాన్యం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి
కోదాడరూరల్: రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించే ధాన్యం నిబంధనల ప్రకారం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో కోదాడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్‌తో కలిసి ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా తేమ శాతం 17 ఉండేలా చూసుకొని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా వారం రోజుల లోపే కాంటాలు వేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకురాగానే వారికి సీరియల్ నంబర్లు ఇవ్వాలని ఆ ప్రకారం కాంటా వేయాలని ఆదేశించారు. సరిపడా గన్నీ బ్యాగులు వస్తున్నాయా లేదా లారీల సమస్య, హమాలీల కొరత ఏమైనా ఉందా అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 5000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని, మరో 1500 క్వింటాళ్లు ఉంటాయని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆయనకు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ధాన్యం రాశులను చూసి వాటి తేమ శాతాన్ని ఆయన పరిశీలించారు. రికార్డులను సైతం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో గోపతి శ్రీనివాస్ అనే రైతు ధాన్యం తేమశాతం పరిశీలించి నాణ్యత బాగుందని ఆ రైతుకు బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీజీఓ పద్మ, ఏపీడీ సురేష్, తహసీల్దార్ వాజిద్‌అలీ, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, డీటీసీఎస్ రాంరెడ్డి, కమతం వెంకటయ్య, అనూష ఉన్నారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్
డీఎస్ చౌహాన్