
రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిస్తాం
హుజూర్‌నగర్: భారత ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తుపాకుల ద్వారానే చరిత్ర మారుతుందనే సిద్ధాంతానికి తాము వ్యతిరేకమని, క్లిష్టమైన సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని సీపీఐ నమ్ముతుందన్నారు. కర్రి గుట్టల్లో కూంబింగ్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి ఎన్‌కౌంటర్లను నివారించాలని కోరారు. మావోయిస్టులు కూడా చట్టపరంగా ఉద్యమాలు చేసి ప్రజల్లో మార్పు తీసుకోచ్చేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, ఎన్నికల హామీలను సక్రమంగా అములు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, ప్రధాన కార్యదర్శి అజయ్‌నాయక్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటయ్య, సూర్యనారాయణ, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
చాడ వెంకటరెడ్డి