
లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్: లిఫ్ట్‌లో ఎక్కేందుకు యత్నించిన వ్యక్తి లిఫ్ట్ గుంతలో పడి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వినుకొండ మండలం గంగవరం గ్రామానికి చెందిన సిరిగిరి శ్రీరామమూర్తి(39) చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గల దివీస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గత పదిహేళ్ల నుంచి భార్యాపిల్లలతో కలిసి చౌటుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. వేసవి సెలవులు రావడంతో శ్రీరామమూర్తి భార్య ప్రశాంతి పిల్లలను తీసుకొని వారం క్రితం బాపట్ల జిల్లా ఇరుకులం మండలం తిమిడితపాడు గ్రామంలోని తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. దివీస్ పరిశ్రమలోనే పనిచేస్తూ చౌటుప్పల్‌లోని రత్నానగర్‌కాలనీలో నివాసముంటున్న తన మిత్రుడు అమర్నేని రమేష్ ఇంటికి శుక్రవారం రాత్రి శ్రీరామమూర్తి వెళ్లాడు. అక్కడ భోజనం చేసిన తర్వాత నాలుగో అంతస్తు నుంచి కిందికి దిగేందుకు లిఫ్ట్ బటన్ నొక్కాడు. అయితే లిఫ్ట్ రాక ముందే వచ్చిందని భావించిన శ్రీరామమూర్తి బలవంతంగా డోర్ తెరిచి లిఫ్ట్‌లో ఎక్కేందుకు యత్నించి లిఫ్ట్ గుంతలో పడిపోయాడు. భారీ శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న రమేష్ బయటకు వచ్చి గమనించగా తీవ్ర గాయాలతో శ్రీరామమూర్తి కన్పించాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే శ్రీరామమూర్తి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.