
అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరిప్రదర్శన కోసం మే 10 తేదీ సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామన్నారు. మార్గమధ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 92980 08888ను, అన్ని బస్‌స్టేషన్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
తగ్గిన ఉష్ణోగ్రతలు
భువనగిరిటౌన్ : భానుడు కాస్త శాంతించాడు. 44 డిగ్రీలకు పైనా నమోదైన ఉష్ణోగ్రతలు 42.2 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం ఎండకు ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. సాయంత్రం చల్లని వాతావరణంతో ఉపశమనం పొందుతున్నారు. శనివారం బీబీనగర్, గుండాల, రాజాపేటలో 42.2 డిగ్రీలు, మిగతా మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ తగ్గడం, వేడి గాలుల కారణంగా ఉక్కపోతతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆశ్రమాల్లో ఉచిత వైద్యసేవలు అందించాలి
భువనగిరి: మండలం మండలంలోని రాయగిరి పరిధిలో గల సహృదయ వయోవృద్ధుల అశ్రమాన్ని శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆశ్రమంలో వసతులు, భోజన నాణ్యతపై ఆరా తీశారు. అనాథ ఆశ్రమాల్లో ఉంటున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. 15100 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ఆమె వెంట మానసిక ఆరోగ్య వైద్యుడు స్వరూప్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్.జైపాల్ ఉన్నారు.
నేత్రపర్వంగా నృసింహుడినిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజల్లో భాగంగా ఉత్సవమూర్తుల నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు.అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్ర థమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, ఆ తరువాత స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుక పూర్తి చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
పలువురు సీఐల బదిలీ
యాదగిరిగుట్ట : జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్ట పట్టణ సీఐ రమేష్‌ను భువనగిరి పట్టణ సీఐగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కమిషనరేట్ కార్యాలయంలోని సీఐ సెల్‌లో విధులు నిర్వహిస్తున్న బి.భాస్కర్ రానున్నారు. యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్‌రావును ఆలేరు ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. సీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న ఎం.శంకర్ యాదగిరిగుట్ట రూరల్ సీఐగా రానున్నారు.

అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

అరుణాచలానికి ప్రత్యేక బస్సులు