‘భూ భారతి’పైనే ఆశలు | - | Sakshi
Sakshi News home page

‘భూ భారతి’పైనే ఆశలు

May 4 2025 6:31 AM | Updated on May 4 2025 6:31 AM

‘భూ భ

‘భూ భారతి’పైనే ఆశలు

సదస్సులు ఈ తేదీల్లో

5న సర్వేపల్లి, రాయిపల్లిలో, 6న రాఘవాపురం, రహీంఖాన్‌పేట, 7న పల్లెర్ల, సింగారం, 8న లింగరాజుపల్లి, కాల్వపల్లి, 9న కూరెల్ల, కప్రాయపల్లి, 12న తుక్కాపురం, పారుపల్లి, 13న మొరిపిరాల, పల్లెపహాడ్‌, 14న ధర్మాపూర్‌, 15న ఆత్మకూరు(ఎం)లో సదస్సులు ఉంటాయని తహసీల్దార్‌ లావణ్య తెలిపారు.

5 నుంచి రెవెన్యూ సదస్సులు

నూతన చట్టంపై అవగాహన, భూ సమస్యలకు పరిష్కారం

జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా

ఆత్మకూరు(ఎం) మండలం ఎంపిక

ఆత్మకూరు(ఎం) : సర్వే నంబర్లలో తప్పిదాలు, సరిహద్దుల గొడవ, పేర్ల మార్పిడి, డిజిటల్‌ సిగ్నేచర్‌.. ఇలా అనేక భూ సమస్యలతో ఏళ్లుగా సతమతమవుతున్న భూ యజమానులు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇకనైనా తమ సమస్యలు తీరుతాయన్నా ఆసక్తితో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఆత్మకూర్‌(ఎం)మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 5నుంచి 15వ తేదీ వరకు అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. మొదటి రోజు సర్వేపల్లి, రాయిపల్లి రెవెన్యూ గ్రామాల నుంచి సదస్సులను ప్రారంభించి ఆత్మకూరు(ఎం)తో ముగించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు సదస్సులు నిర్వహిస్తారు.

సదస్సుల నిర్వహణకు రెండు బృందాలు

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఆత్మకూరు(ఎం) తహసీల్దార్‌ లావణ్య నేతృత్వంలో తొమ్మిది మంది అధికారులు, వలిగొండ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది అధికారులు బృందంలో ఉంటారు. రెవెన్యూ సదస్సుల విజయవంతం కోసం అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి(రెవెన్యూ) ఆత్మకూర్‌(ఎం) తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

పరిష్కారానికి నోచుకోని సమస్యలు వేలల్లో..

మండలంలో పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు అనేకం ఉన్నాయి. మండలంలో 36,356 సాగు భూములు, 15,048 మంది రైతులు ఉన్నారు. సర్వే నంబర్లకు సంబంధించి 40 దరఖాస్తులు, డిజిటల్‌ సిగ్నేచర్‌ కాని భూసమస్యలు 1,411 దరఖాస్తులు, ధరణిలో పరిష్కారం కానివి 8 ఉన్నాయి. 2014 జూన్‌ 6వ తేదీకి ముందు సాదాబైనామా ఫిర్యాదులు 132 వరకు వరకు ఉన్నాయి. కాగా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై దరఖాస్తు దారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

స్థానికంగానే విచారణ

జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఆత్మకూరు(ఎం) మండలాన్ని ఎంపిక చేయడం జరిగింది. తొలి రోజు సర్వేపల్లి, రాయిపల్లిలో రెవెన్యూ సదస్సులు ఉంటాయి. ధరణి ఏర్పాటుకు ముందు మూడేళ్ల పహణీలతో పాటు భూరికార్డులను తీసుకుని రెవెన్యూ సదస్సులకు వెళ్తాం. భూసమస్యలపై ఫిర్యాదు చేసే రైతులకు దరఖాస్తు ఫారాలను ఇంటింటికీ అందజేస్తాం. అట్టి దరఖాస్తు ఫారాలను నింపి రెవెన్యూ సదస్సుల్లో అందజేయాలి. స్థానికంగా విచారణ జరిపి పరిష్కార పత్రాలను జూన్‌ 2న అందజేస్తాం.

–లావణ్య, తహసీల్దార్‌, ఆత్మకూరు(ఎం)

‘భూ భారతి’పైనే ఆశలు 1
1/1

‘భూ భారతి’పైనే ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement