
పరారైన జీవిత ఖైదీ అరెస్టు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : పెరోల్‌పై వచ్చి, గత ఆరు సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న జీవిత ఖైదీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. కోదాడ పోలీస్ డివిజన్ మఠంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు తిరుపతి 2012లో రాచకొండ (అప్పటి సైబరాబాద్) కమిషనరేట్ లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యాడు. ఈమేరకు 2015లో రంగారెడ్డి జిల్లా మూడవ అదనపు సెషన్ కోర్టు సదరు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా.. 2019 ఆగస్టు 17న ముప్పై రోజుల పెరోల్ పై విడుదలయ్యాడు. పెరోల్ అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లకుండా గత ఆరు సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ నివేదిక ఆధారంగా మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా నిందితుడు గుంటూరు జిల్లాలో ఉన్నట్లు నిర్ధారించారు. కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ ప్రత్యేక బృందం నిందితుడు బొడ్డు తిరుపతిని గుంటూరు పట్టణంలో అరెస్ట్ చేశారు. నిందితుడు తన స్వగ్రామం, కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా బంధాలను ఆపేసి గుంటూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తూ అక్కడే ఓ మహిళను వివాహం చేసుకొని స్థిరపడినట్లు తెలిపారు. ఈ కేసు చేదించి నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.