
ప్రాణం తీసిన ఈత సరదా
● ప్రమాదవశాత్తు నదిలో మునిగి విద్యార్థి మృతి
హుజూర్‌నగర్ (చింతలపాలెం) : వేసవి సెలవులు రావడంతో ఈత నేర్చుకునేందుకు కృష్ణా నదికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామానికి చెందిన కొమ్ము వెంకటేశ్వర్లు కొడుకు లోకేష్ (16) కోదాడలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన అతను కృష్ణానదిలో (ప్రాజెక్టు వెనుక జలాల్లో) ఈత నేర్చుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. నడుముకు డబ్బా కట్టుకుని నీటిలోకి దిగాడు. డబ్బా ఊడి పోవడంతో నీటిలో మునిగి పోయాడు. అక్కడ ఉన్నవారు గమనించి గాలించి అతడిని బయటకు తీశారు. అప్పటికే విద్యార్థి మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబెషనరీ ఎస్‌ఐ అజయ్ కుమార్ తెలిపారు.