తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

May 3 2025 12:17 AM | Updated on May 3 2025 12:17 AM

తాళం వేసి ఉన్న  ఇంట్లో చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

డిండి: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం డిండి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. డిండి పట్టణానికి చెందిన కాసుల వెంకటేష్‌ చారి ఇంటికి తాళం వేసి గత నెల 30న మండల పరిధిలోని తవక్లాపూర్‌ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేష్‌ చారి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం తవక్లాపూర్‌ నుంచి ఇంటికి తిరిగొచ్చి న వెంకటేష్‌ తాళం పగులగొట్టి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చోరీ ఘటనపై వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కొండమల్లేపల్లి : కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన కొండమల్లేపల్లి మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పీఏపల్లి మండలంలోని మేడారం గ్రామపంచాయతీకి చెందిన చెనమోని సత్యం(53) బైక్‌పై తిరుగుతూ చేపలు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో చిన్నఅడిశర్లపల్లి గ్రామ సమీపంలోని సంజీవని ట్రస్ట్‌ వద్దకు రాగానే పెద్దవూర నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపు తప్పి సత్యం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపారు.

చోరీ నిందితులకు రిమాండ్‌

కేతేపల్లి : చోరీ చేసిన ద్విచక్ర వాహనాన్ని అమ్మేందుకు హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా కేతేపల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై ఇద్దరు యువకులు సూర్యాపేట నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా కొర్లపహాడ్‌ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుపడ్డారు. వారిని స్టేషన్‌ తీసుకెళ్లి విచారించగా సూర్యాపేట పట్టణం సీతారామపురం గ్రామానికి చెందిన కంభం కుమార్‌, మనబోలు లక్ష్మీనర్సింహగా గుర్తించారు. వీరు గత ఫిబ్రవరిలో కొప్పోలు గ్రామంలో బైక్‌ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బైక్‌ను రికవరీ చేసి జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శివతేజ తెలిపారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో

పట్టుబడిన వ్యక్తికి జైలు

పెన్‌పహాడ్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్షతో పాటు రూ. 2వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపారు. పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన మేడం రమణయ్య శుక్రవారం మద్యం సేవించి వాహనాన్ని నడుపుతుండగా పోలీసులు తనిఖీ చేస్తున్న సమమంలో పట్టుబడ్డాడు. ఈమేరకు కేసు నమోదు చేసి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి వెంకటరమణ ఎదుట హాజరుపరిచారు. దీంతో అతడికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ. 2వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement