
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్
నల్లగొండ: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నల్లగొండ వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు గురువారం నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన ధర్మాడి దుర్గాప్రసాద్, కాకినాడ జిల్లా తడలరేవు మండలం గాడిమొగ్గ గ్రామానికి చెందిన పాసిల సత్యనారాయణ, అదే గ్రామానికి చెందిన కామాడి శ్రీనివాస్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. వీరు 2024 అక్టోబర్‌లో కాకినాడ నుంచి రైలులో నల్లగొండకు వచ్చి పట్టణంలోని అల్కాపురి కాలనీకి చెందిన పాశం జనార్దన్‌రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడి 2 బంగారు చైన్లు, రూ.40వేలు నగదు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా 2024 డిసెంబర్‌లో నల్లగొండ పట్టణంలోని మహిళా ప్రాంగణం వద్ద నివాసముంటున్న బోయిని కరుణాకర్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన పల్సర్ బైక్‌ను దొంగిలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దొంగిలించిన పల్సర్ బైక్‌పై కాకినాడ నుంచి నల్లగొండకు వచ్చి అక్కలాయిగూడెం ప్రాంతంలో నివాసముంటున్న జెట్టి నాగరాజు ఇంట్లో 12 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి కాళ్ల కడియాలు, రూ.1,25,000 నగదు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరిలో పాసిల సత్యనారాయణ, కామాడి శ్రీనివాస్‌ను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 గ్రాముల బంగారు గొలుసు, పల్సర్ బైక్, 50 తులాల వెండి కాళ్ల కడియాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ధర్మాడి దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ధర్మాడి దుర్గాప్రసాద్‌పై 50 చోరీ కేసులు, పాసిల సత్యనారాయణ మీద 16 చోరీ కేసులు, కామాడి శ్రీనివాస్‌పై 3 కేసులు తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల పరిధిలో నమోదైనట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ డానియల్ కుమార్, ఎస్‌ఐ శివకుమార్, సిబ్బంది విష్ణు, నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ గోపాల్‌రావు, హెడ్‌కానిస్టేబుల్ శివరామకృష్ణ, శ్రీకాంత్, అంజాద్, గాంధీని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.