దేవరకొండ: గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లో జరిగిన ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకొండ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామపంచాయతీ బద్యానాయక్ తండాకు చెందిన నేనావత్ చిరంజీవి(23) హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల గ్రామానికి వచ్చిన చిరంజీవి గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై దేవరకొండ నుంచి స్వగ్రామమైన బద్యానాయక్ తండాకు వెళ్తున్నాడు. ఈక్రమంలో కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహులు తెలిపారు.
కొండమల్లేపల్లిలో..
కొండమల్లేపల్లి: పెద్దఅడిశర్లపల్లి మండలంలోని మల్లాపురం గ్రామానికి చెందిన నారాయణదాసు శ్రీనయ్య(53) కొండమల్లేపల్లి పట్టణంలోని విద్యుత్ కేంద్రంలో లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. మండలంలోని కొల్‌ముంతలపహాడ్ గేటు సమీపంలో యూటర్న్ తీసుకునే క్రమంలో దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రమైన గాయాలు కావడంతో శ్రీనయ్యను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి కొండమల్లేపల్లి ఏఈ దేవుజ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.