
అక్రమ కట్టడాలపై చర్యలెక్కడ?
● భువనగిరి మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు
● నామమాత్రపు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు
● పత్తాలేని టాస్క్ ఫోర్స్
అక్రమ కట్టడాలపై నిఘా పెట్టాం
భువనగిరి మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలపై నిఘా పెట్టాం. మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు రెండు ఇళ్లను కూల్చి వేశాం. ప్రజలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసిన వారి పేరు గోప్యంగా ఉంచుతాం.
– రామాంజులరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భువనగిరి
భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రోడ్డు స్థలాన్ని సైతం కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు జీప్లస్ టూకి అనుమతి తీసుకుని బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నామమాత్రపు నోటీసులు జారీ..
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల్లో కొందరు అక్రమార్కులు వారి ఇష్టానుసారం రోడ్డు స్థలాలను కబ్జా చేసి గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. కింది స్థాయి మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్రమంగా నిర్మిస్తున్న గృహ యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అక్రమ కట్టడాలపై సమాచారం ఇవ్వడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి.. కార్యాలయాల కుర్చీలకే పరిమితమవుతున్నారని, అక్రమార్కులపై ఫిర్యాదు చేసినా నామమాత్రపు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, కాసులకు కక్కుర్తి పడి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పట్టించుకోని టాస్క్‌ఫోర్స్
తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టడం, స్థానిక అధికారుల నుంచి అక్రమ నిర్మాణాల జాబితా తెప్పించుకొని వాటిని కూల్చివేయాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది కన్నెత్తి చూడకపోవడంతోనే మున్సిపల్ సిబ్బంది ఆగడాలు కొనసాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.