● ఒక్కరికి ఒకే ఓటు నినాదంతో సర్
● బోగస్ ఓట్ల తొలగింపే లక్ష్యం
● జిల్లాలో ఇప్పటికే 48.41 శాతం ఎన్యుమరేషన్ పూర్తి
బుట్టాయగూడెం : బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడంతో పాటు, ప్రతి ఓటరుకూ ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అనర్హులను తొలగించి, అర్హులతో కూడిన కొత్త జాబితాను రూపొందించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 2002 నాటి సమగ్ర సర్వే ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇప్పటికే ఇంటింటికీ వెళ్తూ పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.
జిల్లాలో 48.41 శాతం ప్రక్రియ పూర్తి
జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,44,193 మంది ఓటర్లు ఉండగా, 1,744 మంది బీఎల్‌ఓలు జూన్ 15 నుంచి తమ పరిధిలోని ఇళ్లను సందర్శిస్తున్నారు. ఇప్పటివరకు 16,34,851 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో ఈ ప్రక్రియ 99.43 శాతం పూర్తయింది. కాగా, పంపిణీ చేసిన ఫారాలలో ఇప్పటివరకు 7,95,931 మందికి సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం 48.41 శాతం మ్యాపింగ్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నాటికి వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేలా బీఎల్‌ఓలు పనులను వేగవంతం చేశారు. ఈ సర్ కార్యక్రమంలో మృతుల కుటుంబాలకు, వలసలు వెళ్లిన వారికి, డబుల్ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నామని, అనంతరం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను శాశ్వతంగా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏజెన్సీ పరిధిలో ‘సిగ్నల్’ కష్టాలు
మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పోలవరం నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ప్రక్రియ కొంత కష్టతరంగా మారింది. ఇక్కడి ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణం. పోలవరంలో మొత్తం 2,55,122 మంది ఓటర్లు ఉండగా, 254 మంది బీఎల్‌ఓలు 2,55,121 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. వీటిలో ఇప్పటివరకు 1,39,271 ఓట్ల మ్యాపింగ్ పూర్తవగా, 54.59 శాతంగా నమోదైంది. సిగ్నల్ లేని గ్రామాల్లో బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను అక్కడికక్కడే మాన్యువల్‌గా పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత సిగ్నల్ లభించే ప్రాంతాలకు చేరుకుని డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ కారణంగానే పని కొంత ఆలస్యమవుతోందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 15వ తేదీ లోపు వంద శాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
నియోజకవర్గం మొత్తం ఓటర్లు బీఎల్‌ఓలు పంపిణీ డిజిటలైజేషన్ పూర్తి అయిన
చేసిన ఫారాలు అయినవి శాతం
దెందులూరు 2,25,615 239 2,24,540 94,381 41.83
ఏలూరు 2,34,948 213 2,28,121 99,042 42.15
చింతలపూడి 2,74,003 273 2,73,077 1,23,389 45.03
నూజివీడు 2,40,581 286 2,40,259 1,18,311 49.18
కై కలూరు 2,06,578 235 2,06,387 1,04,946 54.59
ఉంగుటూరు 2,07,346 214 2,07,346 1,16,591 56.23


