ఉంగుటూరు: ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా వరి సాగు చేసే ఉంగుటూరు మండలంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది మండల వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 25,600 ఎకరాల్లో వరి నాట్లు వేస్తున్నారు. దీంతో ఎటు చూసినా రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో నిమగ్నమై బిజీబిజీగా కనిపిస్తున్నారు.మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా వ్యవసాయ సందడే కనిపిస్తోంది. గత పది రోజులుగా సాగునీటి బోదెలు బాగు చేయడం, గట్లు చెక్కడం, పొలాలను దమ్ము చేయడం, తుర్రాలు సరిచేయడం, నారు పీకడం వంటి పనులతో ఆయకట్టు ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. ఈ హడావుడి మరో 20 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
బెంగాల్ కూలీల రాక
స్థానిక కూలీల కొరతను అధిగమించడానికి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీలు ఇక్కడి గ్రామాల్లో, పొలాల వద్దే తాత్కాలిక మకాంలు ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక కూలీలతో పాటు వీరు కూడా నాట్ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మండలంలోని మెట్ట, డెల్టా ప్రాంతాల్లోని రైతులు ఈ ఏడాది అత్యధికంగా సంపద స్వర్ణ రకం వంగడాన్ని సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుత సీజన్‌లో సాగు ఖర్చులు భారీగా పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేయడానికి ఎకరాకు రూ.5,000, ట్రాక్టరుతో దమ్ము చేయడానికి రూ.4 వేల నుంచి రూ.4,500, గట్లు వేయడానికి ఎకరాకు రూ.1,200 వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు.
మెట్ట, డెల్టా పరిధిలో సాగు ఇలా..
మండలంలోని మెట్ట ప్రాంతంలో బోరు బావుల కింద ఆధారపడి పంట సాగు చేస్తుండగా, డెల్టా ప్రాంతంలో ఏలూరు–గోదావరి కాలువ నీటితో సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంత గ్రామాలైన గొల్లగూడెం, నల్లమాడు, యర్రమల్లిపాడు, ఎ.గోకవరం, గోపాలపురం, గోపినాథపట్నం, నీలాద్రిపురం, నాచుగుంట, వెల్లమిల్లిలో సాగు పనులు ఊపందుకున్నాయి. అలాగే డెల్టా ప్రాంత గ్రామాలైన బాదంపూడి, ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, కై కరం, తల్లాపురం, రావులపర్రు, కాగుపాడు, బొమ్మిడి, దొంతవరం, కాకర్లమూడి, వీఏ పురం నాట్లు వేసుకునే పనిలో బిజిగా ఉన్నారు. ఈ గ్రామాల్లోని ఆయకట్టు పరిధిలో వ్యవసాయ పనులు శరవేగంగా సాగుతుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.
గ్రామాల్లో సందడి వాతావరణం


