నూజివీడు : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు పట్టుదలతో ముందుకు సాగాలని, అప్పుడే సులువుగా లక్ష్యాన్ని సాధించగలుగుతారని ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీకి వచ్చిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు గురువారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జీవితంలో వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు వృథా చేసుకోవద్దని, చక్కగా చదువుకుని దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, ఏమైనా అర్థం కాకపోతే వెంటనే అడగాలని సూచించారు. క్యాంపస్‌లోనే అన్ని వసతులు ఉన్నాయని, ఆసుపత్రి సైతం ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి భయం అక్కర్లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, డీఎస్‌డబ్ల్యూఓలు లంకపల్లి రాజేష్, దుర్గాభవాని, పీయూసీ ఇన్‌చార్జి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు పీహెచ్‌డీ సీట్లు వచ్చినట్లు ప్రిన్సిపాల్ టి.అశోక్ గురువారం తెలిపారు. పి.తేజస్విని, జీఆర్.సత్యనారాయణకు ఈ సీట్లు వచ్చాయన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలో తమ విద్యార్థులకు సీట్లు రావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగం కోర్సు కో–ఆర్డినేటర్ శ్రీరాముడు, అధ్యాపకులు పుత్రయ్య, రమణ, డాక్టర్ ప్రశాంతి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: మండలంలోని నూగొండపల్లిలో రీసర్వే పేరుతో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడి తన భూమిని వేరొక వ్యక్తి పేరుపై నమోదు చేశారని రైతు మల్లవల్లి అర్జున్ రావు ఆరోపించాడు. గురువారం బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ నూగోండపల్లిలో తనకు వారసత్వంగా 1.94 ఎకరాల పొలం ఉందని, అయితే సంవత్సరం క్రితం గ్రామంలో రీసర్వే నిర్వహించారని, ఆ సర్వేలో అప్పటి సర్వేయర్ మునీర్, తన పొలంలోని 16.05 సెంట్లు స్థలాన్ని వేరొకరి పేరుపై అక్రమంగా నమోదు చేశారని ఆరోపించారు. తన భూమిని తనకు మళ్లీ ఇప్పించి, న్యాయం చేసి, అక్రమాలకు పాల్పడిన సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని ఇటీవల సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని బాధితుడు అర్జున్ రావు తెలిపాడు.


