ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లును గురువారం డీఈఓ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ 14 సంవత్సరాల వయసు నిండి చదవగలిగిన, రాయగలిగిన పరిజ్ఞానం కలిగిన వారంతా పదో తరగతి ప్రవేశాలకు అర్హులన్నారు. అలాగే పదో తరగతి అనుత్తీర్ణులై, చదువు మధ్యలో ఆపి వేసిన వారికి ఇది సువర్ణ అవకాశమన్నారు. అలాగే 15 సంవత్సరాల వయసు నించి పదో తరగతి పూర్తి చేసుకున్న వారు ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరడానికి అర్హులన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెడర్లు, మాజీ సైనికోద్యోగులకు ఫీజులో రాయితీ లభిస్తుందని తెలిపారు. ప్రవేశాలు పొందడానికి ఈ నెల 31 వరకూ గడువు ఉందన్నారు. ఇతర వివరాలకు తమ సమీపంలోని మండల విద్యాశాఖాధికారులు, డివిజనల్ విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో గానీ లేదా ఆధీకృత కేంద్రాల్లో గానీ సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ఆశ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ అవధాని తదితరులు పాల్గొన్నారు.


