జంగారెడ్డిగూడెం: పట్టణంలో బుట్టాయగూడెం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామానికి చెందిన నామాల సాయిపవన్ (26) తాపీ పని చేస్తాడు. బయ్యన్నగూడెం నుంచి జంగారెడ్డిగూడెం మోటార్‌సైకిల్‌పై పని నిమిత్తం వచ్చి, పని అయ్యాక తిరిగి బయ్యన్నగూడెం వెళ్తున్నాడు. ఈ సమయంలో బుట్టాయగూడెం రోడ్డులోకి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న ఓమ్నీ వ్యాన్ సాయిపవన్ మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సాయి పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ఓమ్నీ వ్యాన్ డ్రైవర్ మానేపల్లి గంటయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెంటపాడు: మండలంలోని అలంంపురంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాచర్ల నుంచి దాలిరెడ్డి (25), కోళ్లశివ, గాడి ప్రసాద్ ముగ్గురూ కలిసి మోటార్‌సైకిల్‌పై రాచర్ల నుంచి అలంపురం వెళ్లడానికి రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని ఓ వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో బండిపై ఉన్న దాలి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుపుతున్న ప్రసాద్‌కు, కోళ్ల శివకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మెరుగైనవైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. ప్రమాదంలో రెడ్డి మృతదేహాన్ని గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బందువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చినస్వామి తెలిపారు.


