భీమవరం: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 6న భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉన్న ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టనున్నామన్నారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎస్.లక్ష్మణ్, పి.సాయికృష్ణ, పి.త్రినాథ్, జి.కౌశిక్, జి.అభి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: జిల్లావ్యాప్తంగా 99.5 శాతం ఎన్‌రోల్‌మెంట్ ఫారాలు పంపిణీ పూర్తయిందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం బంగారుగూడెంలో జరుగుతున్న సర్ కార్యక్రమం పురోగతిని ఆమె పరిశీలించారు. పారదర్శకంగా, స్వచ్ఛంగా ఓటర్ల జాబి తా రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈనెల 21 నాటికి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. ప్రతి ఓటరును సరైన పోలింగ్ కేంద్రానికి మ్యాపింగ్ చేయడం కీలకమని, మ్యాపింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని బీఎల్‌ఓలను ఆదేశించారు. ఆర్డీవో ఎం.సూర్యారావు, తహసీల్దార్ ఎం.సునీల్‌కుమార్, బీఎల్వోలు ఉన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారిగా పెంచల ప్రభాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు డీఆర్వోగా ఉన్న బి.శివన్నారాయణరెడ్డి గత నెల 30న పదవీ విరమణ చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఇన్‌చార్జి డీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఉండి: ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వం ఐటీఐ ప్రిన్సిపాల్‌గా ఎం.లక్ష్మీసరోజ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఏలూరు ఐటీఐ, డీఎల్‌టీసీ ఏడీగా విధులు నిర్వహిస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఐటీఐ అధికారులు, సిబ్బంది ఆమెను అభినందించారు.
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువు గట్లను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. కై కలూరు మండలం పెంచికలమర్రులో పట్టపగలు ఎవరికీ అనుమా నం రాకుండా కూలీలతో ఓ వ్యక్తి చేపల చెరువు గట్లును పటిష్ట పరుస్తున్నాడు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అధికారులు ధ్వంసం చేసిన చెరువుల్లోనే సాగు చేస్తున్నాడు. దీనిపై ఇటీవల సాక్షిలో ‘ఆగని అక్రమ గట్లు పర్వం’ శీర్షికన కథనం వెలువడింది. దీనిపై అటవీశాఖ కైక లూరు రేంజర్ కె.రామంలింగాచార్యులు స్పందించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని పంపించారు. గట్లును ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడతూ అభయారణ్యంలో అక్రమ సాగు చేసినా, గట్లు ఏర్పాటు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


