టీడీపీలో భూప్రకంపనలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో భూప్రకంపనలు

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

పొంతనలేని ఎమ్మెల్యే సమాధానం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో దేవుడి భూమిని కబ్జా చేసిన అధికార పార్టీ నేతల పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది. అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో పాటు ఆన్‌లైన్‌ రికార్డులు, పలు ఆధారాలు బయట పడుతుండటంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రెవెన్యూ అధికారులైతే ఇప్పటికే ఆన్‌లైన్‌ రికార్డులను మార్పుచేసి, తమ తప్పులను సరిచేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ భూ వివాదంపై గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం రాత్రి ద్వారకాతిరుమల మండల పరిషత్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు దాతలు భూమిని స్వామివారికి అప్పగించండి అంటూ తహసీల్దార్‌కు లేఖ పంపడం చర్చగా మారింది.

ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం పంచాయతీ, లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని, పూరీ మఠాధిపతులైన మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యులు 1992లో చినవెంకన్న దేవస్థానానికి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి సంబంధించిన ఆర్‌ఎస్‌ నెంబర్‌ 38/1 లోని 1.89 ఎకరాల భూమి దేవస్థానం ఆధీనంలోనే ఉంది. స్వామివారి నిత్య సేవలకు వినియోగించే తులసిని అందులోనే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొందరు వ్యక్తులు సదరు భూమిలోకి చొరబడి తులసి మొక్కలను, చెట్లను, చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించారు. ఇదేంటని స్థానికులు ప్రశ్నించగా కొందరు టీడీపీ నేతలు ఈ భూమిని దాత అమ్మాజీ కుటుంబ సభ్యుడైన మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్‌కుమారాచార్యులు 1967లో కమ్మ సేవ సంఘం, ద్వారకాతిరుమలకు బహుమతిగా ఇచ్చారని చెప్పారు. రెవెన్యూ ఆన్‌లైన్‌ రికార్డును పరిశీలించగా చెల్లుబాటుకాని అన్‌రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ ద్వారా సంఘం పేరు మీదకు ఆ భూమిని మార్చినట్టు స్పష్టమైంది. సదరు భూమి దేవుడిదని అన్నందుకు శ్రీవారి దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్‌ నివృతరావుపై, ఓ టీడీపీ నేత వాగ్వాదానికి కూడా దిగాడు. జరిగిన పరిణామాలపై సాక్షి దినపత్రికలో గతనెల 25 నుంచి వరుస కథనాలు ప్రచురితం అవుతుండటంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

వివాదాస్పద భూమి సేవ సమితి పేరున అసైన్‌ అయినట్టు తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి, మళ్లీ రికార్డును రివర్ట్‌ చేయడం జరిగిందని ఎమ్మెల్యే మద్దిపాటి అన్నారు. ఆ భూమి ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉందని, డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అప్పటి వరకు ఆ భూమి ఎవరికీ చెందదని వ్యాఖ్యానించారు. జిరాయితీ భూమిపై ప్రభుత్వ పెత్తనం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫెయిర్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ (ఎఫ్‌ఎల్‌ఆర్‌)లో కూడా మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్‌కుమారాచార్యులు పేరే ఉందని, అడంగల్‌లో పేర్లు మార్చినంత మాత్రాన సేవ సంఘానికి యాజమాన్య హక్కు రాదన్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం ఆధీనంలో 30 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఈ భూమిని వివాదంలోకి నెట్టింది కేవలం టీడీపీ నాయకులేనని భక్తులు మండిపడుతున్నారు.

రోజురోజుకూ ముదురుతున్న లక్ష్మీపురం భూ వివాదం

కబ్జాదారులు తమ పార్టీవారు కావడంతో ఎమ్మెల్యే మద్దిపాటి సతమతం

విలేకరుల సమావేశంలో పొంతన లేని సమాధానాలు

వివాదాస్పద భూమిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఎమ్మెల్యే

దేవుడికిచ్చిన జిరాయితీ భూమిపై ప్రభుత్వ జోక్యం ఏంటటున్న భక్తులు

ఆ భూమి దేవుడికే చెందాలంటూ తహసీల్దార్‌కు దాత కుటుంబీకుల లేఖ

ఎమ్మెల్యే అనుచరుడిదే కీలక పాత్ర

ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్న తిమ్మాపురంనకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ భూ కబ్జాకు సూత్రదారుడిని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ నాయకుడి మాట కాదనలేక చేసిన పనులు కారణంగానే ఎమ్మెల్యే ఈ భూ వివాదంలో ఇరుక్కుని, సతమతం అవుతున్నాడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.

నేడు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన

దేవుడి భూమి దేవుడికే చెందాలని వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ వద్ద గురువారం ఆందోళన చేపట్టి, కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజ తదితరులు పాల్గొంటారని చెప్పారు. పార్టీ శ్రేణులు ఉదయం 10 గంటలకు చేరుకోవాలని వనిత పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement