ఎవరి కోసమో ఈ సిమెంట్‌ రోడ్డు? | - | Sakshi
Sakshi News home page

ఎవరి కోసమో ఈ సిమెంట్‌ రోడ్డు?

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

ఇళ్లు లేని చోట రూ.55 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమేనని ప్రజల మండిపాటు

భీమవరం: కూటమి ప్రభుత్వ పాలన ‘అయిన వారికే అన్నట్టు’ సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామ పరిధిలో రూ.55 లక్షల ఉపాధి హామీ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన సిమెంట్‌ రోడ్డు ప్రజల అవసరాలకు కాకుండా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాల కోసమే వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోని పాలకులు, అధికారులు.. గొల్లలకోడేరులో ఒక్క ఇల్లు కూడా లేని చోట లక్షలాది రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లే దారిలో, పంట కాలువ వెంబడి పలువురు రియల్టర్లు భవన నిర్మాణ స్థలాల విక్రయం కోసం వెంచర్లు వేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ, కాలువ వెంబడి గొల్లలకోడేరు పంచాయతీ పరిధిలో రూ.55 లక్షల వ్యయంతో నూతనంగా సిమెంట్‌ రోడ్డును నిర్మించారు. ఈ రహదారిని గత నెల 30న కలెక్టర్‌ నాగరాణి, డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు.

శిలాఫలకంపై ఒకలా... క్షేత్రస్థాయిలో మరోలా...

గొల్లలకోడేరు గ్రామంలోని ‘శ్రీనిలయం’ నుంచి ‘అల్లూరి వెంకటనాగార్జున’ ఇంటి వరకు సీసీ రహదారి నిర్మించినట్లు శిలాఫలకంపై పేర్కొన్నారు. కానీ, ఆ మార్గం మధ్యలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ప్రజలకు అత్యవసరమైన చోట్ల రోడ్లు వేయకుండా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తారంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏర్పాటుచేసిన శిలాఫలకం

గొల్లలకోడేరులో నూతంగా నిర్మించిన సీసీ రోడ్డు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement