రూ.96.06 కోట్ల పింఛన్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

రూ.96.06 కోట్ల పింఛన్ల పంపిణీ

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

రూ.96.06 కోట్ల పింఛన్ల పంపిణీ

భీమవరం (ప్రకాశం చౌక్‌): జిల్లాలో 2,20,625 మంది లబ్ధిదారులకు రూ.96.06 కోట్ల విలువైన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను బుధవారం పంపిణీ చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 26వ వార్డు బ్యాంక్‌ కాలనీ–2లో ఆయన స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్‌ అందుకున్న వృద్ధురాలు జి.అచ్చయమ్మ ఇంటిని సందర్శించిన జాయింట్‌ కలెక్టర్‌ అక్కడ తాగునీటి సరఫరా, నీటి నాణ్యతను పరిశీలించారు. అలాగే ఐ.వెంకట్రావుకు పింఛన్‌ అందజేస్తూ కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటున్నారో ఆరా తీశారు. అనంతరం అదే ప్రాంతంలోని మురుగు కాలువలను పరిశీలించి కాలువల శుభ్రతపై శానిటేషన్‌ సెక్రటరీని ప్రశ్నించారు. వీధుల్లో ప్రత్యేక డంపింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి, ప్రజలు అక్కడే చెత్త వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎంఎస్‌ఎస్‌.వేణుగోపాల్‌, భీమవరం మున్సిపల్‌ కమిషనర్‌ కే.రామచంద్రారెడ్డి, ఏపీవో ఎం.శ్రీనివాస ప్రసాద్‌, వీఆర్వో హారిక, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ, శానిటేషన్‌ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌పీఎం ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు

జిల్లాలో భూ రీ–సర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో మాత్రమే కొత్తగా కేటాయించిన ఎల్‌పీఎం నంబర్ల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఆస్తి వివరాల నకళ్లు జారీ చేసే ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో బుధవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తన ఛాంబర్‌ నుంచి జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు సర్వే నంబర్ల ఆధారంగా నిర్వహించేవారని, ప్రస్తుతం భూ రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ఎల్‌పీఎం నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్‌ టి.ప్రసాద్‌ రెడ్డి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ ఎన్‌.మాధవి, జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement