రోడ్డున పడేశారొయ్యో | - | Sakshi
Sakshi News home page

రోడ్డున పడేశారొయ్యో

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

రైతులను మోసం చేస్తున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

న్యూస్‌రీల్‌

బంద్‌ విజయవంతం

సిండికేటు దోపిడీపై ఆక్వా రైతులు సమరశంఖం పూరించారు. రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం పిలుపు మేరకు మంగళవారం పట్టుబడులకు విరామం ఇచ్చి జిల్లా అంతటా ధర్నాలు, మోటారు సైకిల్‌ ర్యాలీలతో నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా ఫీడ్‌ కంపెనీల డీలర్లు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు.

బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026

గత 30 ఏళ్లుగా రొయ్యల సాగు చేస్తున్నాను. మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఆక్వా సాగు తీవ్ర సంక్షోభంలో ఉంది. మూడు నెలలుగా ఫీడ్‌ కంపెనీలు మేత ధరలను ఇష్టానుసారం పెంచేశాయి. కిలోకు రూ.4 తగ్గించాలని ప్రభుత్వం చెప్పినా రూ.2 తగ్గించడం రైతులను మోసం చేయడమే.

– నరసింహస్వామి, పూలపల్లి, ఆక్వా రైతు

ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వం స్పందించకపోతే ఆక్వా సాగు కనుమరుగమయ్యే ప్రమాదం ఉంది. ఎకరానికి సుమారు రూ.1.50 లక్షల నష్టం వస్తున్నా సాగును కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతుకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.

– బి.శ్రీనివాస్‌చౌదరి, అండలూరు, ఆక్వా రైతు

సాక్షి, భీమవరం: వనామీ సాగులో టన్ను రొయ్యల ఉత్పత్తికి టన్నున్నర, టైగర్‌ సాగుకు రెండున్నర టన్నుల వరకు మేత అవసరమవుతుంది. టన్నుకు రూ.4 వేల చొప్పున మేత ధరలు పెంచుతున్నట్టు ఫిబ్రవరిలో ఫీడ్‌ కంపెనీలు ప్రకటించాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ మే 5న మరోసారి వనామీ ఫీడ్‌పై టన్నుకు రూ.8 వేలు, టైగర్‌ ఫీడ్‌పై రూ.10 వేలు పెంచాయి. ఈ నెల 13న వనామీ ఫీడ్‌ రూ.10 వేలు, టైగర్‌ ఫీడ్‌ రూ.12 వేలు పెంచారు. ఫీడ్‌ కంపెనీలు ఇష్టానుసారం మేత ధరలు పెంచుతూ పోవడంపై రైతులు ఆందోళనల నేపథ్యంలో టన్నుకు రూ.4 వేలు తగ్గిస్తున్నట్టు జూన్‌ 19న సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేస్తూ టన్నుకు రూ.రెండు వేలు మాత్రమే తగ్గిస్తున్నట్టు ఫీడ్‌ కంపెనీలు స్పష్టం చేయడం గమనార్హం. మరోపక్క నెలన్నర రోజుల క్రితం కిలోకు వంద కౌంట్‌కు రూ.265 ఉన్న ధరను రెండు వారాల క్రితం రూ.220కు తగ్గించేశారు. మిగిలిన కౌంట్ల ధరలకు కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు కోత పెట్టారు. టన్ను వంద కౌంట్‌ రొయ్యల ఉత్పత్తికి రూ.2.6 లక్షలు ఖర్చవుతుంటే రైతు చేతికందేది రూ.2.2 లక్షలు లోపే ఉంటోంది. టన్ను రొయ్యల ఉత్పత్తికి రూ.40 వేలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తాము కష్టనష్టాలకోర్చి ఆక్వా సిండికేట్‌ను పెంచుతున్న చందాన ప్రస్తుత పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. మేత ధరలు తగ్గించాలని, రొయ్య రేట్లు పెంచాలని ఆందోళనలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో కొంతమంది రైతులు స్వచ్ఛంద సాగు విరామం పాటిస్తున్నారు. అయినప్పటికి సీడు, ఫీడు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు దోపిడీని అరికట్టడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర సంఘం ఆక్వా బంద్‌కు పిలుపునిచ్చింది

ధరలు నియంత్రించాలి

ఆక్వా రైతు సంఘం సభ్యులు, ఫీడు కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి టన్నుకు రూ.4 వేల చొప్పున ఫీడ్‌ ధరలు తగ్గించాలని సూచిస్తే కేవలం రూ. 2 వేలు తగ్గించి చేతులు దులుపుకున్నారని ఆక్వా రైతులు ధ్వజమెత్తారు. ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో మేత ధరలను భారీగా పెంచేస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు తగ్గినప్పుడు మాత్రం ఫీడ్‌ ధరలు తగ్గించడం లేదన్నారు. ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి రొయ్య ధరలు గిట్టుబాటుకాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం అయ్యే వరకూ తమ పోరాటం ఆపమని రైతులు స్పష్టం చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు తలపెట్టిన బంద్‌ విజయవంతమైంది. పాలకొల్లు పట్టణంలో ఆక్వా రైతులు పూలపల్లి వై జంక్షన్‌ నుంచి యడ్ల బజార్‌ సెంటర్‌ మీదుగా యాళ్లవానిగరువు వై జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఫీడ్‌ కంపెనీల డీలర్లు ఆక్వా రైతులకు మద్దతుగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. భీమవరం, వీరవాసరంలో రైతులు, ఫీడ్‌ షాపుల డీలర్లు బంద్‌ పాటించారు. రైతులు రొయ్య పట్టుబడులను నిలిపివేశారు. ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర, పోడూరు, ఆచంట మండలాల్లో మేత దుకాణాలు బంద్‌ చేశారు. పోడూరు, ఆచంట ఆక్వా రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో పెనుమంట్ర నుంచి మార్టేరు వరకు ర్యాలీ నిర్వహించారు. ఆకివీడులో వైఎస్సార్‌ సెంటర్‌ నుంచి ఆక్వా రైతులు పాదయాత్రగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెంచిన మేత ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. నరసాపురం పట్టణంలో ఆక్వా రైతులకు మద్దతుగా మేత దుకాణాలను డీలర్లు స్వచ్ఛందంగా మూసివేశారు.

సిండికేట్‌ దోపిడీపై ఆక్వా రైతుల సమరశంఖం

జిల్లా అంతటా రొయ్య పట్టుబడులు నిలిపివేసి బంద్‌లో పాల్గొన్న రైతులు

మోటారు సైకిల్‌ ర్యాలీలు, ధర్నాలతో నిరసన

మేత ధరలు తగ్గించాలని.. రొయ్య ధరలు పెంచాలని డిమాండ్‌

దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపిన ఫీడ్‌ డీలర్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement